Site icon vidhaatha

Chandra Babu | కుప్పం ప్లస్ ఇంకోటి..? రెండు చోట్ల చంద్రబాబు పోటీ?

Chandra Babu |

విధాత‌: టీడీపీ అధినేత చంద్రబాబు తాను జగన్ కు భయపడ్డారా? లేక ఆయనే జగన్ను భయ పెడుతున్నారా? ముప్పయ్యేళ్లుగా గెలుస్తూ వస్తున్న కుప్పంను కాదని ఈసారి ఇంకో చోటు నుంచి పోటీ చేస్తున్నారా ? కుప్పంతోబాటు వేరే నియోజకవర్గాన్ని వెతుకుతున్నారా ? అయితే ఎక్కడి నుంచి చేస్తారు ? ఎందుకీ ప్రయత్నం అనే చర్చ నడుస్తోంది. జగన్ అయితే పులివెందుల నుంచే పోటీ చేస్తారు. అందులో మార్పు లేదు.

కానీ చంద్రబాబు మాత్రం ఈసారి కుప్పంతోబాటు ఇంకో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేసినట్లు చంద్రబాబు కూడా కుప్పంతో బాటు ఇంకో నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్రలో వెతుకుతున్నారని అంటున్నారు. వాస్తవానికి కుప్పంలో చంద్రబాబు 2019లో 30, 700 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయితే ఇక్కడ చంద్రబాబు చాన్నాళ్లుగా తమిళ ప్రజలను దొంగ ఓటర్లుగా చేర్చారని చెబుతూ ఈమధ్య జగన్ ప్రభుత్వం దాదాపు 30 వేల ఓట్లను తొలగించింది. దీనిమీద చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదు చేశారు.

ఇక ఈ 30 వేల ఓట్ల తొలగింపుతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, అయన గెలవడం కష్టమే అని వైసిపి నాయకులు అంటున్నారు. ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించి చూపుతానని పెద్దిరెడ్డి శపథం పూనారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుప్పం మీద నమ్మకం కోల్పోయి, ఓటమి భయంతో ఇంకో నియోజకవర్గాన్ని వెతుకుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే అత్యంత సేఫ్ నియోజకవర్గం కోసం టిడిపి శ్రేణులు వెతుకులాటలో ఉన్నాయని అంటున్నారు.

ఉత్తరాంధ్రలో పోటీ చేస్తే ఈ జిల్లాలలో పార్టీకి మంచి ఊపు వస్తుందని , అందుకే ఇటు చూస్తున్నారని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు అయన కుప్పంలో ఓడిపోతామన్న భయంతోనే ఇంకో సురక్షితమైన నియోజకవర్గాన్ని వేతుకుతున్నారని వైసిపి ఎగతాళి చేస్తోంది.

Exit mobile version