విధాత: జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ (Double bedroom) లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రచ్చ రచ్చగా మారి ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లిలో, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. దరఖాస్తుదారుల జాబితాను వడ పోసి అర్హులైన వారి పేర్లతో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అయితే ఎక్కువగా ఇండ్లు, భూములు ఉన్న వారికి, అధికార పార్టీ వారికే డబుల్ బెడ్రూమ్‌లు దక్కడంతో పేద ప్రజల్లో ఆగ్రహావేశాలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం దరఖాస్తు దారులు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు సకాలంలో అడ్డుకుని ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో దరఖాస్తుదారులకు, అధికారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట సాగింది. తుర్కపల్లి, దేవరకొండలో కూడా డబుల్ బెడ్రూమ్‌ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ దరఖాస్తు దారులు నిరసనలకు దిగారు.