భార్య‌కు ఏ లోటు రాకుండా.. మ‌ర్యాద‌పూర్వ‌కంగా భ‌ర్త విడాకులు.. నెట్టింట వైర‌ల్

వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన చాలా జంట‌లు.. త‌మ సంసార జీవితాన్ని జీవితాంతం సాఫీగా సాగిస్తుంటాయి. కొంత‌మంది దంపతుల‌కు ఆదిలోనే గొడ‌వ‌లు, ఇత‌ర‌త్రా ఆరంభ‌మ‌వుతాయి.

  • Publish Date - February 29, 2024 / 10:35 AM IST

విధాత: వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన చాలా జంట‌లు.. త‌మ సంసార జీవితాన్ని జీవితాంతం సాఫీగా సాగిస్తుంటాయి. కొంత‌మంది దంపతుల‌కు ఆదిలోనే గొడ‌వ‌లు, ఇత‌ర‌త్రా ఆరంభ‌మ‌వుతాయి. ఇంకొంద‌రిలో కొంత‌కాలం త‌ర్వాత ప్రారంభ‌మ‌వుతాయి. ప్ర‌ధానంగా ఆర్థిక అంశాల విష‌యాల్లోనే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఇక వివాహేత‌ర సంబంధాలు, గృహ హింస వ‌ల్ల కూడా విబేధాలు త‌లెత్తుతుంటాయి. వేధింపులు తాళ‌లేక‌, హింస భ‌రించ‌లేక‌ దంప‌తుల్లో ఎవ‌రో ఒక‌రు విడాకులు కోరుకుంటారు. ఈ విడాకులు తీసుకునే క్ర‌మంలో బ‌తుకుదెరువు, పోష‌ణ‌, ఆర్థిక భ‌రోసా వంటి చాలా ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. మొత్తానికి ఘ‌ర్ష‌ణ‌లు, వాగ్వాదాల మ‌ధ్య కోర్టుల చుట్టూ తిరిగిన త‌ర్వాత చివ‌ర‌కు ఏదో ఒక రోజు విడాకులు పొందుతారు.

కానీ ఈ దంప‌తులు మాత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా విడాకులు తీసుకున్నారు. భార్య మ‌న‌సెరిగిన భ‌ర్త‌.. ఆమెకు ఏ లోటు రానివ్వ‌కుండా.. అన్ని ర‌కాల స‌దుపాయాలు, వ‌స‌తులు స‌మ‌కూర్చి విడాకులు ఇచ్చాడు. ఈ మ‌ర్యాద‌పూర్వ‌క విడాకుల క‌థ‌ను శృతి చ‌తుర్వేది అనే ఓ నెటిజ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఈ మ‌ర్యాద‌పూర్వ‌క విడాకుల క‌థ నెట్టింట వైర‌ల్ అవుతోంది.

నాకు తెలిసిన ఇద్ద‌రు ఫ్రెండ్స్ 26 ఏండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లాయ్య‌క ఆమె త‌న ఉద్యోగాన్ని వ‌దిలేసి.. ఇంటి బాగోగులు చూసుకుంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. అయితే త‌న భార్య కోసం భ‌ర్త ఓ ఇల్లు కొనుగోలు చేశాడు. భార్య మ‌న‌సు ఏంటో భ‌ర్త‌కు తెలుసు కాబ‌ట్టి.. బ్యాంకుల్లో ఎఫ్‌డీలు, బాండ్లు చేశాడు. ప్ర‌తి నెల ఆమెకు ఆదాయం వ‌చ్చే మార్గాల‌ను ఏర్పాటు చేశాడు. భ‌విష్య‌త్ భ‌ద్ర‌త కోసం బంగారం కూడా డిపాజిట్ చేశాడు. ఆమె పేరు మీద భూమి కూడా కొన్నాడు. అంతేకాకుండా ఆమె అనారోగ్యానికి గురైతే మంచి వైద్య స‌దుపాయాలు అందుకునేందుకు అత్యుత్త‌మైన మెడిక‌ల్ పాల‌సీ కూడా చేయించాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల‌కు లోనుకాకుండా ఆమెకు అన్ని ర‌కాల స‌దుపాయాలు, వ‌స‌తులు క‌ల్పించాడు. వారు ఒక‌రు గురించి ఒక‌రు చెడుగా మాట్లాడుకోరు. ఈ రోజుకు వారి ప్రేమ అంతం కావొచ్చు.. కానీ మ‌ర్యాద మాత్రం క‌ల‌కాలం నిలిచే ఉంటుందని శృతి చ‌తుర్వేది త‌న ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

విడాకులు తీసుకునే వారు ఎందుకు ఇలా ఆలోచించ‌రు అని అనిపించింది అని శృతి మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్ర‌తి విష‌యంలో సానుకూలంగా స్పందించాలి. కానీ ప్ర‌తికూల‌త‌లు గురించి ఆలోచించ‌కూడ‌ద‌న్నారు. ఆ దంప‌తుల మ‌ధ్య అసంతృప్తి త‌ప్పితే వారు విడిపోవ‌డానికి ఇత‌ర కార‌ణాలు ఏమీ లేవు అని శృతి తెలిపారు.

Latest News