విధాత: చనిపోయిందనుకున్న మహిళ మళ్లీ స్పృహలోకి వచ్చింది. అది కూడా 18 గంటలు ప్రయాణించాక. దీంతో ఆమె వెంట ఉన్న ఇద్దరు కుమారు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని బెగుసరాయికి చెందిన రమావతి దేవి అనే వృద్ధురాలు తన ఇద్దరు కుమారులతో కలిసి ఫిబ్రవరి 11వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని కొర్వా జిల్లాకు వచ్చింది. అక్కడ ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుమారులిద్దరూ తల్లిని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు డాక్టర్లు చెప్పారు.
దీంతో సొంతూర్లో తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని కుమారులు నిర్ణయించారు. ఇక ఓ ప్రయివేటు వాహనంలో బీహార్‌లోని బెగుసరాయికి బయల్దేరారు. 18 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించిన తర్వాత.. ఔరంగాబాద్ వద్ద ఆమె స్పృహలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుమారులు వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. తల్లిలో కదలికలు ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. బెగుసరాయిలోని సదర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వృద్ధురాలికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
రోడ్డు కుదుపులకు సీపీఆర్
ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రోడ్డు మార్గం గుండా ప్రయాణించడంతో.. ఆ కుదుపులకు ఆటోమేటిక్‌గా సీపీఆర్ జరిగిందన్నారు. దాంతో వృద్దురాలు స్పృహలోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు సీపీఆర్ చేయడం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడుకోవచ్చు.