Site icon vidhaatha

World Athletics Championships | తొలిసారి ఆసియా రికార్డ్ బ్రేక్ చేసిన.. భారత పురుషుల అథ్లెటిక్స్ బృందం

World Athletics Championships |

ఈ మ‌ధ్య కాలంలో అథ్లెటిక్స్ విభాగంలో భారత్ ఎంతో పురోగతి సాధించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న వ‌ల‌న పైన‌ల్ చేరుకోవ‌డ‌మే కాక ఆసియా రికార్డును కూడా బద్దలుకొట్టి కొత్త చరిత్రను లిఖించింది.

బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల హీట్స్‌లో భారత బృందం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్‌లు కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి క్వాలిఫై రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి అద‌ర‌హో అనిపించారు. ఈ క్వార్టెట్ ఆధారంగా, అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మ‌న దేశం తొలిసారిగా 4×400 మీటర్ల రేసులో ఫైనల్స్‌కు చేరుకుంది.

ఈ అథ్లెటిక్స్ ఈవెంట్‌లో గత ఏడాది ఒరెగాన్‌లో 2.59.51 సెకన్ల సమయంతో ఆసియా రికార్డు జపాన్ పేరిట ఉండ‌గా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నెలకొల్పిన 3.00.25 సెకన్ల రికార్డును జపాన్ బద్దలు కొట్ట‌డం మ‌నం చూశాంం. ఇప్పుడు భార‌త్ కేవ‌లం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించడం విశేషం.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన.. భారత్ తన హీట్‌లో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా, గ్రేట్ బ్రిటన్ మూడో స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌న‌ర్హం. రేసులో భారత క్వార్టెట్ బలం ముందు అమెరికా కూడా వెనుకబడ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది..

భారత్, అమెరికా మధ్య కేవలం 1 సెకను గ్యాప్ మాత్రమే ఉండ‌గా, అమెరికా తన రేసును 2.58.47 సెకన్లలో పూర్తి చేసింది. గ్రేట్ బ్రిటన్ మాత్ర 2.59.42 సెకన్లు తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా కూడా ఆదివారం త‌న అదృష్టం ప‌రిక్షించుకోబోతున్నాడు.

గ‌తేడాది ర‌జ‌తంతో స‌రిపెట్టుకున్న నీర‌జ్ ఈ సారి స్వ‌ర్ణం సాధిస్తాడ‌ని భార‌త అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. కాగా, క్వాలిఫై రౌండ్ కి సంబంధించిన‌ తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించడంతో నీర‌జ్ మీద అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

Exit mobile version