Site icon vidhaatha

YADADRI: జగన్మోహినిగా లక్ష్మీ నరసింహుడు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల పర్వంలో ఏడవ రోజు సోమవారం స్వామివారు జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం గర్భాలయంలో మూలవర్యులకు నిత్యాభిషేకాలు, ఆరాధనలు అనంతరం బ్రహ్మోత్సవాల అలంకార సేవ పర్వంలో భాగంగా వేంచేపు మండపంలో స్వామివారిని జగన్మోహినిగా అలంకరించి ప్రత్యేక పూజలు, మంగళహారతుల పిదప మాడవీధుల్లో ఊరేగించారు.

క్షీరసాగర మధనంలో లోకాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమృతాన్ని అసురులకు దక్కకుండా చేసిన అవతారమే జగన్మోహిని అవతారం. దుష్టులను నిలువరించేందుకు, సజ్జనులను సంరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు దాల్చిన రూపమే జగన్మోహిని అవతారం. భగవానుడు ధర్మపరాయణుల పక్షమేనని జగన్మోహిని అవతార పరమార్ధం.

ఉగ్ర నరసింహుడు సమ్మోహన రూపమైన జగన్మోహినిగా భక్తులకు దర్శనం ఇవ్వగా స్వామివారిని దర్శించుకుని భక్తజనులు పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహ చార్యులు,యజ్ఞాచార్యులు పారాయణికులు, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించనుండగా, అనంతరం ఎదుర్కొలు ఘట్టం నిర్వహించనున్నారు. రేపు మంగళవారం ఉదయం రామాలంకారం, హనుమంతు వాహన సేవ, సాయంత్రం గజవాహన సేవ, రాత్రి 8 గంటలకు లక్ష్మీ నరసింహుల కళ్యాణోత్సవ ఘట్టం నిర్వహించనున్నారు.

Exit mobile version