Site icon vidhaatha

యాదాద్రి ఆల‌యం.. సప్త రాజగోపురాల వైభవం

విధాత‌: యాదగిరి గుట్ట ప్రధాన ఆలయం సప్త రాజ గోపురాలను త్రితల, పంచతల, సప్తతల అనే మూడు రకాల శిల్పాకృతులలో నిర్మించారు. గర్భాలయం పైన ఉండే పంచతల విమాన గోపురం 45 అడుగుల ఎత్తులో అష్టభుజ రూపంలో నరసింహుని కీర్తి కిరీటమై కనిపిస్తుంది.

తొలి రాజగోపురం ఆలయం రెండో ప్రాకారంలో తూర్పున ఉండే ఐదు అంతస్తుల 55అడుగుల ఎత్తు ఇంద్రగోపురం. స్వామివారి దర్శనానికి భక్తులు పంచతల తూర్పు రాజగోపుర ద్వారం నుండే లోపలికి ప్రవేశిస్తారు. దీనికి ఇరువైపులా 5 అడుగుల ఎత్తున రెండు ఏనుగుల ప్రతిమలు, ద్వారా పాలకులు జయ విజయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు.

రెండో ప్రాకారంలో ఉత్తర దిక్కు పంచతల రాజగోపురం కుబేర గోపురం. ఇరువైపులా నాలుగు అడుగుల ఎత్తున రెండు సింహాల ప్రతిమలను ప్రతిష్టించారు. గత ఆలయంలో ఉత్తరద్వార దర్శనం లేకపోవడంతో తూర్పు ద్వారం గుండానే స్వామి వారి ముక్కోటి ఏకాదశి దర్శనం కల్పించేవారు. పునర్ నిర్మిత ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం నుండి స్వామివారి ముక్కోటి ఏకాదశి దర్శనం అందుబాటులోకి వచ్చింది.

దేవాలయం దక్షిణ దిక్కున రెండో ప్రాకారంలో ఉండే మూడో పంచతల గోపురం యమ రాజగోపురం. ఐదు అంతస్తులలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన యమగోపురం ద్వారానికి ఇరువైపులా సింహాలా, ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఆలయం మొదటి ప్రాకారంలో పశ్చిమ దిక్కున 55 అడుగుల ఎత్తులో పంచతల వరుణ రాజగోపురం నిర్మించారు. ఈ గోపురానికి ఇరువైపులా ఐరావతాలు, జయ విజయల విగ్రహాలు ఉన్నాయి . రెండో ప్రాకారములో పశ్చిమాన ఉన్న సప్తతల రాజగోపురం విశిష్టమైనదిగా భావిస్తారు.

గర్భాలయంలో స్వామి వారు పశ్చిమ వైపు చూస్తున్నట్లుగా ఉన్నందున పశ్చిమాన ఉన్న మాడవీధికి, మహారాజ గోపురానికి నిర్మాణశైలిలో ప్రాముఖ్యతను ఇచ్చారు. 75 అడుగుల ఎత్తులో ఏడంతస్తుల సప్త తల మహారాజ గోపురంగా దీనిని శిల్పులు తీర్చిదిద్దారు. ఇతర ఆలయాల్లో తూర్పు రాజగోపురమే అన్నిటికంటే ఎక్కువ ఎత్తులో నిర్మిస్తారు.

ఇక్కడ లక్ష్మీనరసింహుడు పశ్చిమ ముఖంగా ఉండడంతో పశ్చిమ రాజగోపురం ఎక్కువ ఎత్తులో నిర్మించారు. మొదటి ప్రాకారంలో ఈశాన్య దిక్కున త్రితల గోపురం మూడంతస్తులతో 33 అడుగుల ఎత్తున నిర్మించారు. అద్భుత శిల్పకలతో ఉండే ఈ చిరు రాజగోపురం నుంచి అంతరాలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు.

కొండపైన స్వామివారి గర్భగుడి మహాద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠం, విమాన గోపురం పైనున్న శ్రీ సుదర్శన చక్రం, రాజగోపురాల మీదనున్న కలశాలకు బంగారు తాపడం కోసం ఆలయానికి చెందిన 16 కేజీల స్వర్ణాన్ని వినియోగించారు. 17 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పుతో టేపు కలపతో నిర్మిచిన గర్భగుడి మహాద్వారానికి బంగారు పూత అద్దారు. ధ్వజస్తంభాన్ని అసిఫాబాద్ జిల్లా రెబ్బన అడువుల కలపను వినియోగించి 37 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి 1785 గ్రాములు బంగారంతో, బలిపీఠానికి 1550 గ్రాముల బంగారంతో స్వర్ణ తాపడం చేశారు.

స్వామి మూలవిరాట్ కొలువై ఉన్న గర్భాలయం పైన కృష్ణశిలతో 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఏడోగోపురం విమాన గోపురంలో నలువైపులా మహావిష్ణు రూపాలను పొందుపరిచారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ దివ్య విమానానికి స్వర్ణ తాపడం చేయించేందుకు 125 కిలోల బంగారాన్ని సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది.

కొండపైన వాహన పార్కింగ్ పక్క నుండి క్యూ కాంప్లెక్స్ ను పదివేల మంది సామర్ధ్యంతో నిర్మించారు. క్యూలైన్లను అల్యూమినియం, ఇత్తడి ని వినియోగించి జైనుల వాస్తు నిర్మాణ శైలిలో శంకు చక్రాల డిజైన్లు కనిపించేలా నిర్మించారు. క్యూలైన్ల నుండి భక్తులు తూర్పు రాజగోపురం నుండి ఈశాన్య రాజగోపురంల ద్వారా నేరుగా ఆలయ ముఖమండపంలోకి ప్రవేశిస్తారు.

కళాకృతులు.. మ‌హాద్భుతం

ముఖమండప మార్గంలో ఐరావతాలు, హనుమంతుడు, ప్రహ్లాదుడు, యాదఋషి దివ్య శిల్పాలు ఏర్పాటు చేశారు. ప్రధానాలయానికి ముందు ఉన్న ముఖ మండపాన్ని శిల్పకళా రాజసం ఉట్టిపడేలా వాస్తు శిల్పాలతో గోడల పైన, స్తంభాలపైన, పైకప్పు పైన పలు శిల్పకళాకృతులతో పాటు 32 రూపాల్లో నరసింహ చిత్రాలను, ప్రహ్లాద చరిత్ర దృశ్యాలను చిత్రీకరించారు.

లక్ష్మీ నరసింహుడు స్వయంభూగా వెలసిన గర్భాలయ రాతిగుహ వద్దకు చేరుకునే ముందు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తారు. అక్కడ అష్టభుజి ప్రాకార మండపంలో గండభేరుండ స్వామి దర్శనం చేసుకొని మహా మండపంలోనికి ప్రవేశిస్తారు. ఇక్కడ గోడలపై తంజావూర్ నగషిలతో రూపొందించిన లక్ష్మీ నరసింహ కళ్యాణ ఘట్టాలు ఆకట్టుకుంటాయి.

అక్కడి నుండి స్వర్ణకాంతులతో మెరిసిపోయే గర్భగుడి మహాద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం పైన ప్రహ్లాద చరిత్ర స్వర్ణమయమైన చిత్రాలు కనువిందు చేస్తాయి. మహా ద్వారం నుండి గర్భాలయం కు చేరుకోగానే జ్వాలా నరసింహుడిగా, యోగనంద, గండభేరుండ నరసింహుడిగా, లక్ష్మీ నరసింహడిగా స్వామి దర్శనమిస్తారు.

స్వామి దర్శనానంతరం బయటకు వచ్చి ఉపాలయాలలోని లక్ష్మీదేవి, గోదాదేవి, ఆళ్వార్లను దర్శించు కుంటారు. 34 అడుగుల ఎత్తున రెండు అంతస్తులుగా ఉన్న మహా మండపంలోని 12 ఆల్వార్ల విగ్రహాలను చూసుకుంటూ స్వామి వారి శయన మండపం వద్ద నుండి బంగారు ఊయలను వీక్షిస్తూ గర్భాలయానికి అభిముఖంగా రామానుజల మందిరం, స్వర్ణ మయ ధ్వజస్తంభము, బలిపీఠాన్ని దర్శించుకుని ఆలయ అంతర్భాగ విద్యుత్ కాంతులను తిలకిస్తూ పశ్చిమ రాజగోపురం ద్వారా రెండో మాడ వీధికి చేరుకొని బయటకు వెళ్తారు.

మాడ వీధుల్లో స్వామి వారి నిత్య కళ్యాణ మండపం, అద్దాల మంటపం, స్వామి వారి ప్రసాద వంటశాల రామానుజా కూటమి, అలంకార సేవలు నిర్వహించే వేంచేపు మండపం వీక్షిస్తూ భక్తులు బయటకి సాగుతారు. స్వామివారి ప్రధానాలయం రాత్రి వేళల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ దీప కాంతులతో దివ్య క్షేత్రంగా నేత్రపర్వంగా కనిపిస్తుంది.

స్వామివారి తెప్పోత్సవం నిర్వహణ కోసం లక్ష్మీ పుష్కరిణిని, కళ్యాణకట్ట దీక్షదారుల కాంప్లెక్స్, సత్య నారాయణ స్వామి వ్రత మండపం, భక్తజన పుష్కరిణిలు కొండ దిగువన గండి చెరువు వద్ద ఏర్పాటు చేశారు. లక్ష్మి పుష్కరిణికి కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి బస్వాపురం నరసింహ సాగర్ రిజర్వాయర్ ద్వారా నిత్యం స్వామి వారి అభిషేకాలకు, తెప్పోత్సవాలకి గోదావరి జలాలు సరఫరా జరిగేలా ఏర్పాటు చేశారు.

Exit mobile version