Site icon vidhaatha

వైభవోపేతంగా ప్రారంభమైన యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా యజ్ఞాచార్యులు, ప్రధానార్చకుల బృందం, పారాయణికుల వేద మంత్ర పఠనంల మధ్య వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయంలో నిత్యారాధన అనంతరం శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్తి వాచనం, రక్షాబంధన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాల పర్వం ప్రారంభమైంది.

అద్భుత శిల్పకళా నిర్మిత నూతన ఆలయంలో ఈ దఫా వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం విశేషం. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, లోకాలకు శుభం కలగాలని వేదమంత్ర పఠనంతో విశ్వక్సేన ఆరాధన చేశారు.ఈ వేడుకతో భగవానుగ్రహం సిద్ధించి విశ్వశాంతి, లోక కళ్యాణాలు కలుగునని శాస్త్ర ప్రసిద్ధి.

స్వస్తివాచనం ద్వారా లోకమంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో శుభప్రదంగా ఉండాలని కోరుతూ భగవంతుని అర్చించారు. ఉత్సవ మూర్తులకు, మూలవరులకు పాంచరాత్రాగమ శాస్త్రానుసారం రక్షాబంధనం చేసి అష్టాదళ శక్తి దేవతలను ఆహ్వానం చేసి వేదమంత్రంతో, దూపదీపాలు సమర్పించి స్వామివారికి, అమ్మవారికి కంకణ ధారణ చేశారు.

మృత్సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమాలను నిర్వహించారు. భూ సూక్తంతో భూదేవిని అర్చించి మృత్తికను సేకరించి పాలికలలో నింపి అంకురారోపణ మంత్రములతో నవధాన్యములను మంత్రించి పవిత్ర జలములతో ఉత్సవాంతం వరకు ప్రతిరోజు ఆరాధిస్తారు. లోకమంతా సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ఈ వేడుక ప్రత్యేకత.

రేపు బుధవారం బ్రహ్మోత్సవాల రెండో రోజు ఉదయం అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, సాయంత్రం భేరీ పూజ, దేవత ఆహ్వానం, హవనం కార్యక్రమాలను నిర్వహిస్తారు..

Exit mobile version