ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ వేళ‌.. స‌రికొత్త కుట్ర‌ల‌కు తెర‌

స‌మైక్య రాగం అందుకున్న వైసీపీ వెనుక నుంచి చ‌క్రం తిప్పుతున్న బీజేపీ వీలైతే ఏపీ, తెలంగాణలను కలపడం మంచిదే.. అదే మా విధానం అంటున్న స‌జ్జ‌ల‌ రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల.. నిజం కాలేదు స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌ను తిప్నికొట్టిన కాంగ్రెస్ నేత పొన్నం విధాత‌: ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వెళ వైసీపీ నేత‌లు స‌రికొత్త కుట్ర‌ల‌కు తెర‌లేపుతున్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని న‌గ‌రాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైన వైఎసీపీ నేత‌లు తెలంగాణ‌, ఏపీల‌ను క‌ల‌పాల‌న్న కొత్త […]

  • Publish Date - December 8, 2022 / 01:03 PM IST
  • స‌మైక్య రాగం అందుకున్న వైసీపీ
  • వెనుక నుంచి చ‌క్రం తిప్పుతున్న బీజేపీ
  • వీలైతే ఏపీ, తెలంగాణలను కలపడం మంచిదే..
  • అదే మా విధానం అంటున్న స‌జ్జ‌ల‌
  • రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల.. నిజం కాలేదు
  • స‌జ్జ‌ల వ్యాఖ్య‌ల‌ను తిప్నికొట్టిన కాంగ్రెస్ నేత పొన్నం

విధాత‌: ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వెళ వైసీపీ నేత‌లు స‌రికొత్త కుట్ర‌ల‌కు తెర‌లేపుతున్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని న‌గ‌రాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంలో దారుణంగా విఫ‌ల‌మైన వైఎసీపీ నేత‌లు తెలంగాణ‌, ఏపీల‌ను క‌ల‌పాల‌న్న కొత్త డిమాండ్‌ను కావాల‌ని తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు. ఈ మేర‌కు గురువారం వైసీపీ నేత, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేత వీలైతే ఏపీ, తెలంగాణ‌ల‌ను క‌ల‌ప‌డం మంచిద‌న్న స్టేట్‌మెంట్ ఇప్పించాడు.

60 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్నిలేకుండా చేయాల‌న్న కుట్ర జ‌రుగుతున్న‌ట్లు స‌జ్జ‌ల ప్ర‌క‌ట‌న ద్వ‌రా అర్థ‌మ‌వుతున్న‌ది. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాల‌ని బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా విఫ‌ల‌మైంది. కాంగ్రెస్ నేత‌ల‌ను, టీఆర్ ఎస్ అసంతృప్తి నేత‌ల‌కు ఎర‌వేసి త‌మ పార్టీలోకి తీసుకొని అధికారంలోకి రావాల‌ని చేసిన కుటిల య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో బీజేపీ తెర‌వెనుక నుంచి తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ‌తీసే కుట్ర‌ల‌కు దిగింది. మొద‌టి నుంచి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని మోఢీ తాజాగా రెండు రాష్ట్రాల క‌ల‌యిక అంశాన్నికావాలని తెర‌మీద‌కు తెప్పించార‌ని తెలంగాణ వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాజ‌ధానిని నిర్మించుకోలేక‌..

ప్ర‌జ‌ల జీవ‌న విధానంలో కానీ, రాజ‌కీయ నాయ‌కుల ఆలోచ‌న‌ల తీరులో కానీ తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతానికి చాలా వ్య‌త్యాసం ఉంటుంది. అక్క‌డి వారికి ఫ్యాక్ష‌న్ కల్చ‌ర్‌తో పాటు, వ్యాపార ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా ఉంటాయి. ఈ ప‌ద్ద‌తుల‌కు అనుగుణంగానే అక్క‌డి నేత‌ల‌ ఆలోచ‌న‌లు ఉంటాయి. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌రువాత ఏపీలో అధికారంలోకి వ‌చ్చి, పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఒకేసారి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర‌మంత న‌గ‌రాన్నినిర్మిస్తాన‌ని గొప్ప‌ల‌కు పోయి ఎల్లెలుకల‌ ప‌డ్డారు.

అమ‌రావ‌తి పేరుతో మ‌హాన‌గ‌రం నిర్మించ‌డం సంగ‌తి త‌రువాత‌, క‌నీసం స‌చివాల‌యం, అసెంబ్లీ, ఉద్యోగులు, అధికారులు, మంత్రుల అధికారిక నివాసాలు కూడా త‌న 5 ఏళ్ల కాల‌ప‌రిమితిలో నిర్మించ‌డంలో చంద్ర‌బాబు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. కానీ అమ‌రావ‌తి మ‌హాన‌గ‌రం పేరుతో భారీ ఎత్తున త‌న వారితో చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

ఒక‌టి కాదు.. మూడు అన్న జ‌గ‌న్..

చంద్ర‌బాబు నాయుడు త‌న ప‌ద‌వీ కాలంలో నిర్మించ‌లేక మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వెళ్లిన రాజ‌ధానిని 2019ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ పూర్తి చేసి న‌ట్లైతే ఏపీ ప్ర‌జ‌లకు రాజ‌ధాని న‌గ‌రం కాస్త ఆల‌స్యంగానైనా ద‌క్కేది. కానీ అమ‌రావతి చుట్టూ బాబు వ‌ర్గీయుల‌చేతుల్లోనే భూములున్నాయ‌ని, వారి చేతుల్లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం ఉంద‌ని భావించిన జ‌గ‌న్, త‌న వారి కోసం ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ పేరుతో మూడు రాజ‌ధానుల‌ అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. ఈ మేర‌కు ప‌రిపాల‌న రాజ‌ధానిని విశాఖ‌గా ప్ర‌క‌టించి జ‌గ‌న్ త‌న అనుచ‌రుల చేత అక్క‌డ రియ‌ల్ వ్యాపారం చేయించార‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

కార‌ణాలు ఏవైనా..

ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు కార‌ణాలు ఏమి చెపుతున్నా రాజ‌ధానిని నిర్మించుకోవ‌డంలో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. అనేక అవ‌కాశాలు, ఆర్థిక ప‌రిపుష్టి ఉండి కూడా కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తోనే రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి మ‌ద్రాసు రాష్ట్రం నుంచి 1953లో విడివ‌డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

భాష పేరుతో బ‌ల‌వంతంగా తెలంగాణ విలీనం

ఆనాడు ఆంధ్రా నేత‌లు కేవ‌లం స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాలు నిర్మించుకోలేక‌, భాష పేరుతో బ‌లవంతంగా తెలంగాణ‌ను విలీనం చేసుకొన్నారు. ఆనాడు హైద‌రాబాద్ స్టేట్ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రాన్ని చెర‌బ‌ట్టారు. ఆనాటి నుంచి 60ఏళ్ల పాటు అప్ర‌తి హాతంగా త‌మ దోపిడిని కొన‌సాగించిన ఆంధ్ర నేత‌ల నుంచి సుధీర్ఘ పోరాటం ద్వారా ప్ర‌జ‌లు తెలంగాణ‌ను విముక్తి చేసుకున్నారు. స్వ‌రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎట్ట‌కేల‌కు తెలంగాణ రాష్టం ఏర్ప‌డింది.

తొలినాళ్ల‌లోనే తెలంగాణ‌కు మోసం చేసిన మోడీ

స్వ‌రాష్ట్రం వ‌చ్చింద‌న్న సంతోషాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోడీ ద‌క్క‌కుండా చేశాడు. 2014 ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు తీసుకున్నమోడీ, బీజేపీ నేతృతంలోని కేంద్ర ప్ర‌భుత్వం సీలేరు జ‌ల విద్యుత్ ప్రాజెక్టును ఏపీకి క‌ట్ట‌బెట్టింది.

దీంతో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను బ‌ల‌వంతంగా ఏపీలో క‌లిపింది. ఇలా ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చెప‌ట్టిన తొలి నాళ్ల‌లోనే తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం చేసిన మోదీ, తాజాగా త‌న పాచిక‌లు తెలంగాణ‌లో పార‌వ‌ని భావించి త‌న‌కు అనుకూలంగా ఉన్న వైసీపీ నేత‌ల ద్వారా తెలంగాణ‌ను, ఏపీలో విలీనం చేయాల‌నే స‌రికొత్త కుట్ర‌ల‌కు తెర‌లేపాడు.

మోడీ మొద‌టి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదో ఒక రూపంలో వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ‌తికించార‌ని మోడీ అన్న మాటల‌ను ఈ సంద‌ర్భంగా తెలంగాణ వాదులు గుర్తు చేసుకుంటున్నారు. మోడీ డైరెక్ష‌న్‌లో భాగంగానే వైసీపీ నేత‌లు తెలంగాణ‌, ఏపీలు క‌ల‌వాల‌న్న స్టేట్ మెంట్ ని స‌జ్జ‌ల ఇచ్చార‌న్న‌ అభిప్రాయం తెలంగాణ వాదుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది.

సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉందని వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తుంది వైసీపీనే అని ఆయ‌న అన్నారు.

అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది వైసీపీనే అని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తామ‌న్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలని, లేదంటే సరిదిద్దాలని కోరుతామ‌న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానమ‌న్నారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసులు వేశారన్నారు.

తీవ్రంగా ఖండించిన పొన్నం

రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల.. నిజం కాదు.. అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ స్ప‌ష్టం చేశారు. వైసీపీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై పొన్నం తీవ్రంగా స్పందించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలంగాణ‌, ఏపీ క‌ల‌వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు.