Site icon vidhaatha

కేంద్ర బడ్జెట్‌.. ప్రశంసలతో పోటీపడ్డ వైసీపీ, టీడీపీ

విధాత: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నవాదనలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు చాలావరకు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే కేంద్ర బడ్జెట్‌లో పెద్దపీట వేసిందనే విమర్శించాయి. కానీ ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బడ్జెట్‌పై పొగడ్తల వర్షం కురిపించడానికి పోటీ పడినట్లు కనిపించింది. కేంద్రం బడ్జెట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించడానికి ఇది దొహద పడుతుందన్నారు.

2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానంలోకి రావడం గొప్ప విషయమని కొనియాడారు. అలాగే 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన, రైతులకు రూ. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస యోజన కింద గృహ నిర్మాణం కోసం రూ. 79 వేల కోట్లు, ఆక్వా రంగానికి రూ. 6 వేల కోట్లు కేటాయించడాన్ని బాబు గారు స్వాగతించారు. వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్‌ ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.

ప్రధాన ప్రతిపక్ష నేతగా అధికారపార్టీని విమర్శించాలి కాబట్టి వైసీపీపై చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ తరఫున 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించి జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు సాధించడంలో విఫలమైందని విమర్శించడం బాబు ద్వంద్వ విధానాలకు నిదర్శనం.

ఇక వైసీపీ కూడా బాబు కంటే తామేమీ తక్కువ తినలేదు అన్నట్టు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ బాగుందన్నారు. అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కనపెట్టి పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌ రూ. 45 లక్షల కోట్లు అని, ప్రి బడ్జెట్‌లో మేం ప్రతిపాదించిన 4 సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తున్నదని దీనికి బుగ్గన కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు.

ఈ రెండు పార్టీల నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఆ మధ్యన మాజీ ఎంపీ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వచ్చాయి. ఏపీలో 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఏ పార్టీ తరఫున గెలిచినా వాళ్లంతా బీజేపీకే ఓటు వేస్తారని అన్నారు. బీజేపీకి అక్కడ అంతగా బలం లేకపోయినా వీరే ఆ పార్టీకి బలం అన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. కేంద్రం ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై వైసీసీ, టీడీపీ స్పందనలు వింటే అదేదో సినిమాలో డైలాగ్‌ను కొంత మార్చి చెప్పుకుంటే.. లాస్ట్‌ ప్రశంస మనది అయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టు లేదూ!

Exit mobile version