- ఔను.. మాది కుటుంబ పాలన
- తెలంగాణకు పట్టిన శని మోడీ
- అదానీని కుబేరున్ని చేయడం ఆయన లక్ష్యం
- నిధులతో ప్రభుత్వాలను కూలుస్తున్నారు
- ప్రీతి సంఘటనను రాజకీయం చేయడం సిగ్గుచేటు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజలు పదిసార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చేసింది. నీ పార్టీ, నీ ప్రభుత్వానికి, మీకెందుకు సోయి లేదంటూ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులు, దళారీలు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను కోరుతున్నాడని, ఎన్ని ఛాన్సులు ఇచ్చినా ఏం చేశారని ప్రశ్నించారు. ఆత్మహత్యలు, కరెంటు లేని రోజులు మళ్లీ రావాల్నా అంటూ ప్రశ్నించారు.
స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో రూ.125 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లి క్రాస్ రోడ్డులో సోమవారం జరిగిన భారీ బహిరంగ సభకు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అధ్యక్షత వహించగా కేటీఆర్ మాట్లాడారు.
- మాది కుటుంబ పాలనే
బారాబర్ మాది కుటుంబ పాలన అంటూ కేటీఆర్ సమర్ధించుకున్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులు. ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్ అంటూ వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.
- అదానీని కుబేరున్ని చేయడమే లక్ష్యం
నల్ల ధనం లేకుండాచేయడం వల పదిహేను లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ప్రధానమంత్రి తీరు ఉందన్నారు. అదానీ ఇచ్చే నిధులతో ఓట్లు కొనాలి, ఎమ్మెల్యేలను కొనాలి, ప్రభుత్వాలను పడగొట్టాలి, పార్టీలు చీల్చాలి ఇదే పని తప్ప, ఇంకొక పని లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- తెలంగాణకు శని ప్రధాని
తెలంగాణలో కొత్తగా 100 కిలోమీటర్ల రైలు కూడా మోడీ వెయ్యలే…ఇంత దుర్మార్గంగా తెలంగాణకు అన్యాయం చేశారని కేటీఆర్ విమర్శించారు. వరంగల్ జిల్లా పక్కనే ఉన్న కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోడీ దేవుడా.. తెలంగాణలో జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుకు దేవుడా, ట్రైబల్ యూనివర్సిటీ, ఒక్క నవోదయ గానీ, విశ్వవిద్యాలయం కానీ, మెడికల్, ఒక నర్సింగ్ కాలేజ్ గాని ఇయ్యనందుకు దేవుడా? మాకు మాత్రం ప్రధాని దేవుడు కానే కాదు. తెలంగాణకు పట్టిన శని అన్నారు. తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదైనా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ప్రీతి సంఘటన రాజకీయం చేస్తున్నారు
ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు. డాక్టర్ ప్రీతి కాలేజీలో రాగింగ్‌వల్ల మనస్థాపానికి గురై చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మాటలు మాట్లాడొచ్చని మేము ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ శ్రీహరి ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జనం ఈ సభకు హాజరయ్యారు.