Site icon vidhaatha

కాంగ్రెస్‌లో ష‌ర్మిల చేరిక‌కు డేట్ ఫిక్స్‌.. అన్న‌య్య‌తో పోరుకు సిద్ధ‌మా..?

విధాత‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సోద‌రి వైఎస్ ష‌ర్మిల (Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరిక‌కు ముహూర్తం కుదిరిన‌ట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌ని, ఏపీసీసీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని కొద్ది రోజులుగా భారీ స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ) పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న ష‌ర్మిల‌ ఈ నెల 4న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొంటార‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.


అందుకు అనుగుణంగానే భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మాలు, పార్టీ విలీనం ప్ర‌క్రియ త‌దితర విష‌యాల‌పై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి మంగ‌ళ‌వారం (నేడు) ఉద‌యం 11:00 గంట‌ల‌కు త‌న నివాసంలో ప‌లువురు నాయ‌కుల‌తో ష‌ర్మిల స‌మావేశం అయ్యారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌ ఓట్లు చీలిపోకూడ‌ద‌నే ఉద్దేశంతో పోటీ నుంచి సైతం విర‌మించుకున్నారు. ‘నేను కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇద్దామ‌ని నిర్ణ‌యించుకున్నా.


ఎందుకంటే ఇక్క‌డి ప్ర‌భుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేట్టు క‌నిపిస్తోంది. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీనీ ఈ తొమ్మిదేళ్ల పాల‌నా కాలంలో నెర‌వేర్చ‌లేదు. అందుకే ఆయ‌న తిరిగి అధికారంలో రాకూడ‌ద‌ని కోరుకుంటున్నా. ఒక వేళ నేను పోటీలో ఉంటే వైఎస్సార్ కుమార్తెగా ప్ర‌జ‌లు గుర్తించినందున‌ 55 స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే ప్ర‌మాదముంది. అందుకే పోటీ నుంచి త‌ప్పుకొంటున్నా’ అని తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముందు ష‌ర్మిల ప్ర‌క‌టించారు.


అప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానంతో జ‌రిగిన చ‌ర్చ‌లను అనుస‌రించి ఆమె ఆంధ్ర రాజ‌కీయాల్లో ప్ర‌వేశించ‌నున్నారు. త్వ‌ర‌లో అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా.. సోద‌రుడు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆమె ప్ర‌చారం చేసే అవ‌కాశముంది. గ‌తంలో ఏపీ రోడ్ల దుస్థితిపై విమ‌ర్శ‌లు చేయ‌డం, తాజాగా తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు కుటుంబానికి క్రిస్మ‌స్ కేకు పంప‌డం వంటి చ‌ర్య‌లు ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తున్నాయి.

Exit mobile version