Site icon vidhaatha

ఎర్రబెల్లి ఇలాఖాలో వైఎస్ విగ్రహం ధ్వంసం.. ఇటీవలే ఆవిష్కరించిన YS షర్మిల

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసమైంది. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో మంగళవారం రాత్రి వైయస్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

వైయస్‌కు మంచి పేరు ఉంది

ఇదిలా ఉండగా ఇటీవల పాలకుర్తి నియోజకవర్గం లో షర్మిల పర్యటన సందర్భంగా ఎర్రబెల్లి పై పలు విమర్శలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా జనగామలో మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ‘మీ నాయన రాజశేఖర్ రెడ్డికి మంచి పేరు ఉంది… దాన్ని చెడగొట్టకు’ అంటూ షర్మిలకు హితబోధ చేశారు. వై ఎస్‌ను పొగిడిన కొద్ది రోజులకే అదే మంత్రి నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.

నెలన్నరకే నేలకూల్చారు

గత నెల 16వ తేదీన ఈ విగ్రహాన్ని వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3,800 కిలోమీటర్లు మైలురాయికి చేరుకున్న సందర్భంగా అవుతాపురం గ్రామంలో ఈ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. గత నెల 16వ తేదీన ఉద్రిక్త పరిస్థితుల నడుమ వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులకే గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం గమనార్హం. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు దుండగుల కోసం ఆరా తీస్తున్నారు.

షర్మికులకు అడ్డంకులు

ఇప్పటికే వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండుసార్లు రద్దు అయిన విషయం తెలిసిందే. తొలిసారి నర్సంపేట నియోజకవర్గం పరిధిలో, రెండవసారి మానుకోటలో అర్ధాంతరంగా ఆమె పాదయాత్ర ఆగిపోయింది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహాన్ని, దాడిని ఆమె చవి చూసింది. ప్రస్తుతం ఆమె పాదయాత్ర మానుకోట నియోజకవర్గంలో ఆగిపోయింది. ఈ విషయమై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ స్థితిలో ఆమె ప్రారంభించిన ఆమె తండ్రి విగ్రహం ధ్వంసం కావడం చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైతున్నాయి.

Exit mobile version