Car Journey | కారు ప్రయాణాలతో క్యాన్సర్‌ ముప్పు.. తాజా అధ్యయనంలో వెల్లడి..!

Car Journey | కారు ప్రయాణాలతో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ రోజుల్లో చాలామంది కారు ప్రయాణాలే చేస్తున్నారు. ఎక్కువ మంది కార్లలో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. విందులు, వినోదాలు, టూర్లకు వెళ్లాలంటే తప్పకుండా కార్లనే వినియోగిస్తున్నారు. అయితే, కార్లలో ఎక్కువసేపు జర్నీ చేయడం, అదీ కారు అద్దాలు వేసుకుని వెళ్లడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

  • Publish Date - May 10, 2024 / 09:00 AM IST

Car Journey : కారు ప్రయాణాలతో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ రోజుల్లో చాలామంది కారు ప్రయాణాలే చేస్తున్నారు. ఎక్కువ మంది కార్లలో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. విందులు, వినోదాలు, టూర్లకు వెళ్లాలంటే తప్పకుండా కార్లనే వినియోగిస్తున్నారు. అయితే, కార్లలో ఎక్కువసేపు జర్నీ చేయడం, అదీ కారు అద్దాలు వేసుకుని వెళ్లడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కారు క్యాబిన్ క్యాన్సర్ కారక విష వాయువులతో నిండి ఉందని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి.

కారు క్యాబిన్స్‌లో క్యాన్సర్ కారకాలు

అమెరికాలో ఇటీవల నిర్వహించిన పీర్ రివ్యూడ్ రిసెర్చ్ సంచలన విషయాలను వెల్లడించింది. క్యాబిన్‌లోని గాలిలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు తేల్చింది. ఈ వాయువులను పీల్చడంవల్ల కారులో ప్రయాణిస్తున్న వాళ్లు తీవ్రమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కారు క్యాబిన్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే కెమికల్స్ ఉత్పత్తి అవుతున్నాయని వివరించింది. అమెరికాలోని సుమారు 30 రాష్ట్రాల్లో నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా 2015 నుంచి 2022 వరకు మార్కెట్లోకి వచ్చిన కార్లపై ఈ అధ్యయనం నిర్వహించారు.

ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్‌తో ముప్పు

కార్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు క్యాబిన్లో మంటలు వ్యాపించకుండా ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ ఉపయోగిస్తారు. సీట్లు, ఇంటీరియర్ తయారీలోనూ దీనిని వినియోగిస్తారు. రక్షణ కోసం వాడే ఈ కెమికల్స్ కారణంగానే ఇప్పుడు క్యాన్సర్ ముప్పు తలెత్తుతున్నదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో నడిచే 99 శాతం కార్లలో TCIPP అనే ఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనాన్ని వాడుతున్నారు. దాంతోపాటు TDCIPP, TCEP అనే మరో రెండు ఫ్లేమ్ రిటార్డెంట్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి.

రోజుకు ఒక గంట కూడా ప్రమాదమే..

సగటున రోజుకు ఒక గంట కారు నడిపినా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తులు, పిల్లలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుందంటున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడుతాయని చెబుతున్నారు. పిల్లల్లో తక్కువ పెరుగుదల, ఉబ్బసం, నరాల బలహీనత, ఊబకాయం సహా పలు ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ఫ్లేమ్ రిటార్డెంట్ల వినియోగంవల్ల పిల్లల్లో IQ శక్తి గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. నిజానికి పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా శ్వాస తీసుకుంటారు. దీంతో వారి మీద ఫ్లేమ్ రిటార్డెంట్ కెమికల్స్ ప్రభావం అధికంగా ఉంటుంది.

వేసవిలో పరిస్థితి దారుణం

వేసవిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. విపరీతమైన వేడి కారణంగా కారు క్యాబిన్‌లో విష రసాయనాలను విడుదల చేసే వాయువులు పెరుగుతాయని వెల్లడించారు. వేసవిలో మరిన్ని శ్వాస సమస్యలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి మరింత తీవ్రమైతే క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎలా కాపాడుకోవాలి..?

కారు క్యాబిన్ లో విడుదలయ్యే విష రసాయనాల నుంచి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు షెడ్లు, గ్యారేజీలలో కార్లు పార్కింగ్ చేసే సమయంలో విండోలు ఓపెన్ చేసి పెట్టాలి. టాక్సిక్ ఫ్లేమ్ రిటార్డెంట్ వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జర్నీకి కొద్ది సేపటి ముందు కారు అద్దాలు ఓపెన్ చేయాలి.

Latest News