Site icon vidhaatha

Mumbai | ఎయిరిండియాలో 2,216 ఉద్యోగాల ఇంటర్వ్యూలకు 25వేలకుపైగా హాజరు

ముంబై: దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తున్నదో తెలుసుకోవడానికి ఇది తాజా ఉదాహరణ. ఎయిరిండియాలో 2,216 ఉద్యోగాల కోసం 25వేల మంది రావడంతో దాదాపు తొక్కిసలాట పరిస్థితి నెలకొన్నది. గంటల తరబడి ఆహారం, మంచినీళ్లు లేక ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ముంబైలో ఈ ఉద్యోగాలకు వాకిన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించడంతో వేల సంఖ్యలో అభ్యర్థులు కౌంటర్ల వద్ద గుమిగూడారు.

హ్యాండీమెన్‌, యుటిలిటీ ఏజెంట్‌ పోస్టులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ ప్రాంతానికి చేరుకునేందుకు పలువురు అభ్యర్థులు వాహనాలపై నుంచి, చెట్ల పైనుంచి దాటుకుని ముందుకు వచ్చేందుకు ప్రయత్నించడం వీడియోల్లో కనిపించింది. వాకిన్‌ ఇంటర్వ్యూలో తమ వంతు వచ్చేదాకా వారంతా గంటల తరబడి ఆహారం, కనీసం మంచినీళ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో చాలా మంది నీరసంగా, అసహనంతో కనిపించారు.

పెద్ద సంఖ్యలో వచ్చిన అభ్యర్థులనే మేనేజ్‌ చేయడం ఒక దశలో ఎయిరిండియా సిబ్బందికి కూడా సాధ్యం కాలేదు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉన్నదని అర్థమవడంతో రెజ్యుమేలు ఇచ్చి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని సిబ్బంది కోరినట్టు తెలుస్తున్నది. ఈ పోస్టులకు కనీస విద్యార్హత ఎస్సెస్సీ/ టెన్త్‌ క్లాస్‌ ఉండటం, కనీసం వేతనం 20000 కావడంతో ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఎగబడ్డారు. ‘నేను హ్యాండీమాన్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను. 22,500 జీతం ఇస్తామన్నారు’ అని దాదాపు 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఒక అభ్యర్థి ఎన్డీటీవీకి చెప్పారు.

రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను సరిగ్గా నిర్వహించలేదని ఏవియేషన్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ గిల్డ్‌ ప్రధాన కార్యదర్శి జార్జ్‌ అబ్రహం విమర్శించారు. తదుపరి ఎయిర్‌పోర్టు అధికారులు ఇంటర్వ్యూకు 200 మందిని పిలవాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చినవారిలో చాలా మంది ఫ్రెషర్లు. అందులోనూ 12వ తరగతి పాసైనవారు ఎక్కువ మంది ఉన్నారు. ‘అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదని, పరిస్థితి అదుపులోకి తెచ్చామని పోలీసు అధికారులు తెలిపారు.

Exit mobile version