38శాతం ఐఐటియన్లకు ఈ ఏడాది దొరకని కొలువులు! ఇదీ కారణం..

దేశంలోని 23 ఐఐటీలకు చెందిన దాదాపు 38 శాతం మందికి ఈ ఏడాది ఇంత వరకూ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో కొలువులు దొరకలేదు. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌ సింగ్‌ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్‌తో ఈ విషయం వెలుగు చూసింది

  • Publish Date - May 23, 2024 / 04:48 PM IST

న్యూఢిల్లీ: దేశంలోని 23 ఐఐటీలకు చెందిన దాదాపు 38 శాతం మందికి ఈ ఏడాది ఇంత వరకూ క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో కొలువులు దొరకలేదు. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌ సింగ్‌ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్‌తో ఈ విషయం వెలుగు చూసింది. సంఖ్యాపరంగా చెప్పాలంటే సుమారు 7వేల మంది ఐఐటీ విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగాలు లభించలేదు. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 3400గా ఉండగా.. ఇప్పుడు దాదాపు రెట్టింపు అయిపోయింది.

ఐఐటీ ఢిల్లీ క్యాంపస్‌లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్లేస్‌మెంట్‌ సెషన్‌ దాదాపు పూర్తి కావచ్చినా.. ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయి. ఇక్కడ ఎంత ప్రయత్నించినా ఇంకా దాదాపు 400 మంది విద్యార్థులు ఇంకా ఉద్యోగాలు పొందలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఐఐటీ అధికారులు.. పూర్వ విద్యార్థుల సంఘాన్ని సంప్రదించి, వారికి కొలువులు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని కోరారని ఆర్టీఐ సమాధానంతో వెల్లడైంది.

ఎక్కడెక్కడో కాకుండా.. పూర్వ విద్యార్థులకు సంబంధించిన సంస్థల్లో వారికి ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కనీసం రిఫరెన్స్‌, ఇంటర్న్‌షిప్‌ లభించే విధంగా జూనియర్‌లకు సహకరించాలని ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఐఐటీ బాంబే కూడా తన పూర్వ విద్యార్థులను సహకారం కోరింది. ప్రస్తుతం ఇక్కడ ప్లేస్‌మెంట్స్‌ కొనసాగుతున్నాయి. ఇంకా జూన్‌ చివరి వరకూ సమయం ఉన్నా.. ఇంకా దాదాపు పది శాతం మంది.. అంటే సుమారు 250 మంది ఇంకా దిక్కుతోచని స్థితిలోనే ఉన్నారు.

ధీరజ్‌సింగ్‌ ప్రశ్నకు ఆర్టీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం.. గత ఏడాది 329 మంది ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు దొరకనేలేదు. వారిలో 2022 బ్యాచ్‌కు చెందిన 171 మంది కూడా ఉన్నారు. దేశంలో ప్రఖ్యాత విద్యా సంస్థగా పేరున్న బిట్స్‌ పిలానీ సహా అనేక ఐఐటీలు కూడా తన విద్యార్థులకు కొలువల కోసం పూర్వ విద్యార్థుల సహకారంపై ఆధారపడాల్సి వచ్చింది. బోర్డులో ప్లేస్‌మెంట్స్‌ దాదాపు 20 శాతం నుంచి 30శాతం వరకూ తగ్గిపోయాయని బిట్స్‌ గ్రూప్‌ వైస్‌ చాన్స్‌లర్‌ వీ రాంగోపాల్‌రావు తెలిపారు. ఏదైనా సంస్థ పూర్తిస్థాయిలో ప్లేస్‌మెంట్స్‌ ఇప్పించామని చెప్పుకొన్నప్పటికీ అవి స్థాయికి తగినవి కావని ఆయన అన్నారు.

ప్లేస్‌మెంట్స్‌ను ఈ ఏడాది ప్రముఖంగా ముందుకు వచ్చిన చాట్‌ జీపీటీ, ఇతర లార్జ్‌ లాంగ్విజ్‌ మాడల్స్‌ ప్రభావితం చేశాయని విద్యారంగ నిపుణుల అంటున్నారు. ఇద్దరు ఉద్యోగులు చేసే పని ఒక్కరే చేసే విధంగా సాంకేతిక తయారైన నేపథ్యంలో ఉద్యోగాల డిమాండ్‌ గణనీయంగా తగ్గుతున్నదని చెబుతున్నారు. ఈ ఏడాది పలు దేశాల్లో ఎన్నికలు ఉండటం వల్ల కూడా ఆయా దేశాల్లోని కంపెనీలు కొలువుల భర్తీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని అంటున్నారు.

Latest News