Site icon vidhaatha

20 గంట‌ల పాటు బోరుబావిలోనే.. అయినా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ రెండేండ్ల బాలుడు

ఈ బాలుడు మృత్యుంజ‌యుడే. ఏదో ఒక‌ట్రెండు నిమిషాలు కాదు.. ఏకంగా 20 గంట‌ల పాటు బోరు బావిలోనే ఉండిపోయాడు. కానీ చివ‌ర‌కు ఊపిరితో బ‌య‌ట‌ప‌డ్డాడు. దీంతో అధికారుల శ్ర‌మ‌కు ఫ‌లితం ద‌క్కింది. త‌ల్లిదండ్రుల ప్రార్థ‌న‌లకు ఫ‌లితం ల‌భించింది. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ బాలుడి త‌ల్లిదండ్రులు గుండెల‌కు హ‌త్తుకున్నారు. అధికారుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క విజ‌య‌పుర జిల్లాలోని లాచ్‌య‌న గ్రామానికి చెందిన రెండేండ్ల బాలుడు సాత్విక్ ఆడుకుంటూ త‌న ఇంటికి స‌మీపంలోని బోరు బావిలో నిన్న సాయంత్రం ప‌డిపోయాడు. అయితే 16 అడుగుల లోతులో ఉన్న బోరు బావిలో నుంచి ఏడుపు వినిపించ‌డంతో స్థానికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అదృశ్య‌మైన సాత్విక్ ఆ బోరుబావిలో ప‌డిపోయి ఉండొచ్చ‌ని స్థానికులు అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో అధికారుల‌కు స‌మాచారం అందించారు.

బోరు బావి వ‌ద్ద‌కు చేరుకున్న అధికార యంత్రాంగం నిన్న సాయంత్రం 6:30 గంట‌ల‌కు స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించింది. దాదాపు 20 గంట‌ల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ద‌ళాలు తీవ్రంగా శ్ర‌మించాయి. 16 అడుగుల లోతులో ఉన్న బాలుడి క‌ద‌లిక‌ల‌ను సీసీ కెమెరాల‌తో గ‌మ‌నించారు. ఊపిరితో ఉన్నాడ‌ని నిర్ధారించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆక్సిజ‌న్‌ను బాలుడికి అందించారు.

బోరు బావికి స‌మాంతరంగా భారీ గుంత త‌వ్వారు. 20 గంట‌ల పాటు శ్ర‌మించిన త‌ర్వాత సాత్విక్‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీశారు. బాలుడి త‌ల‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. బోరు బావిలో నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ బాలుడిని చూసి త‌ల్లిదండ్రులు సంతోషించారు. బాలుడిని గుండెల‌కు హ‌త్తుకున్నారు. ఆ త‌ర్వాత చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Exit mobile version