Sudha Murthy Controversial Comments | వారేమైనా బృహ‌స్ప‌తా? సుధామూర్తి దంపతుల దుమారం.. కుల గణనకు వక్రభాష్యం

కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో పాల్గొనేందుకు నిరాకరిస్తూ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

(విధాత నేషనల్‌ డెస్క్‌)

Sudha Murthy Controversial Comments | ‘చదువు రాక ముందు బలపం అంటారు. చదువు వచ్చిన తరువాత బప్పం అంటారు’ అనే సామెత కొందరికి సరిపోతుందేమో. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గత మూడు వారాలుగా కుల గణన నిర్వహిస్తున్నది. ఈ సర్వేలో అన్ని కులాల వారి నుంచి వివరాలు ఆన్‌లైన్‌ విధానంలోనే సేకరిస్తున్నారు. ఇందుకోసం లక్షల మంది ప్రభుత్య ఉద్యోగులు ఇంటింటికీ తిరుగుతున్నారు. అయితే ఈ సర్వేలో పాల్గొనేందుకు ఇన్పోసిస్ అధినేత ఎన్ ఆర్.నారాయణ మూర్తి దంపతులు నిరాకరించారు. తాము వెనుకబడి వర్గాలు (బీసీ)కు చెందిన వాళ్లం కాదని, కనుక సర్వేకు వివరాలు ఇవ్వడం లేదన్నారు. నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా దంపతులు కొన్ని అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. భోజనం హోటళ్లలో చేయమని, ఆఖరికి స్పూన్ కూడా ఇంటి నుంచే తమ వెంట తీసుకువెళ్తామని సుధామూర్తి చేసిన వ్యాఖ్యలను పలువురిని నొప్పించాయి. వారానికి 70 గంటలు పనిచేయాలని నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

సర్వేకు నో

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, విద్య సర్వే -2025 ను సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభించింది. రాష్ట్ర బీసీ కమిషన్ ఈ సర్వేను నిర్వహిస్తున్నది. నారాయణ మూర్తి గడచిన దశాబ్ధకాలంగా కొన్ని అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన తీరుగానే భార్య సుధామూర్తి కూడా ఈ మధ్య వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన అంశాల్లో వారు మాట్లాడుతున్న తీరు సమాజంలో పలు వర్గాల మనుసును నొప్పించేలా ఉన్నాయని అంటున్నారు. తాము వెనుకబడిన వర్గాలకు చెందిన కులం వాళ్లం కాదు కనుక ప్రభుత్వం చేస్తున్న కుల సర్వేలో పాల్గొనడం లేదని సుధామూర్తి రెండు రోజుల క్రితం ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు కూడా సర్వేలో సమాచారం ఇవ్వాలని బలవంతం చేయవద్దని, ఇష్టమైతేనే సమాచారం ఇవ్వవచ్చని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కొద్ది రోజుల క్రితం సర్వే కోసం ఉద్యోగులు వారి ఇంటి వద్దకు వెళ్లారు. మా ఇంట్లో సర్వే చేయాల్సిన అవసరం లేదని ఆమె ఖరాకండిగా చెప్పి పంపించారు. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని కూడా ఆమె అందచేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ నిర్వహిస్తున్న సర్వేకు వ్యక్తిగత కారణాలతో వివరాలు అందించడం లేదని అందులో పేర్కొన్నారు. తాము బీసీ కులాలకు చెందిన వారము కాదని, అందువల్లే సర్వే లో పాల్గొనడం లేదన్నారు.

గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు

సుధామూర్తి 2023 లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను పూర్తి శాఖహారినని, ఎక్కడికైనా వెళ్తే తమ వెంట భోజనం, తిను బండారాలను తీసుకువెళ్తామని తెలిపారు. నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లలో కంచాలు, చెమ్చాలను ఉపయోగించడానికి భయమేస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. నారాయణమూర్తి దంపతులు విపరీతమైన ట్రోల్‌కు గురయ్యారు. ఇది పూర్తిగా బ్రాహ్మణవాదమేనని పలువురు ఘాటుగా స్పందించారు. ఆమె అల్లుడు, యూకే మాజీ అధ్యక్షుడు రిషీ సునాక్ చక్కగా నాన్ వెజిటేరియన్ భుజిస్తున్నాడని, దీనికి ఏం సమాధానం చెబుతారని పలువురు ఎద్దేవా చేశారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయ్ కూడా కుల గణనపై విమర్శలు గుప్పించారు. కులాల సర్వే పేరుతో మంత్రులు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఉచితాలను ఇస్తూ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు.

నారాయణ మూర్తి కూడా తక్కువేమీ కాదు

సుధామూర్తి భర్త, నారాయణ మూర్తి కూడా తక్కువేమీ కాదు. ప్రైవేటు ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలంటూ 2023 చివర్లో ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలో బానిసతత్వానికి ఇది నిదర్శనమని, దీని మూలంగా మానసికంగా, శారీరకంగా దెబ్బతింటారని పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదని, ఆచరణీయం కాదని ఖండించారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తన వ్యక్తిగత అభిప్రాయం అని, అందరికీ వర్తించదని నారాయణ మూర్తి దిగొచ్చారు. పిల్లలను సినిమాలు, సరదాలకు అలవాటు చేయవద్దని కూడా వ్యాఖ్యానించి తల్లిదండ్రుల ఆగ్రహానికి గురయ్యారు. దశాబ్దకాలం క్రితం అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పై మాజీ ప్రధాని దేవెగౌడ, నారాయణ మూర్తి మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రానికి ఇలాంటి ఎయిర్పోర్టులు కాదని, రైతులకు చేతినిండా పని కావాలని, సాగు నీరు అందించే లక్ష్యం ఉండాలని దేవెగౌడ వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో నారాయణ మూర్తి ఘాటుగా ప్రతిస్పందించారు. దేవెగౌడ ఇంకా రాతియుగంలో ఉన్నారనే విధంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి చేశాయి.

ఘాటుగా స్పందించిన సీఎం సిద్ధూ

తమ ప్రభుత్వం చేస్తున్న కుల గణనను రాజ్యసభ సభ్యురాలు అపార్థం చేసుకుంటున్నారని సీఎం సిద్ధరామయ్య దెప్పి పొడిచారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఙ‌త‌కే వదిలేస్తున్నానని అన్నారు. ఇది బీసీ కులాల సర్వే కాదని, అర్థం చేసుకోకపోతే నేనేమి చేయగలనని ఆయన ప్రశ్నించారు. ఇన్పోసిస్ వ్యవస్థాపకులు బృహ‌స్ప‌తి (తెలివి గల వారు) అనుకుంటున్నారా? అన్నారు. ఇప్పటికే నేను వందసార్లు చెప్పాను. ఇది బీసీ కులాల సర్వే కానే కాదన్నారు. రాష్ట్రంలోని ఏడు కోట్ల జనాభా ఉండగా, అన్ని కులాల వివరాలు సేకరిస్తున్నామన్నారు. సంపన్న వర్గాలకు చెందిన కులాలు కూడా శక్తి, గృహ‌లక్ష్మీ వంటి సంక్షేమ పథకాలను పొందుతున్నారన్నారు. 2027 లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జన గణనతో పాటు కుల గణన సర్వే నిర్వహిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం సర్వే వివరాలు అడిగితే అప్పుడు మూర్తి దంపతులు ఏం చెబుతారని ప్రశ్నించారు. కుల గణన సర్వేలో పాల్గొనవద్దని బీజేపీ నాయకులు ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారని, ఆ ప్రభావం సుధామూర్తి మీద ఉండవచ్చని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే అనుమానం వ్యక్తం చేశారు.