- బెంగాల్, తమిళనాడులో ఏం జరగబోతున్నది?
- ఇప్పటికే ఢిల్లీలో ఆప్‌ను మడతపెట్టేశారు
- మహారాష్ట్రలో శివసేనను లేవకుండా కొట్టారు
- జాతీయ పార్టీల ముందు ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనా!
విధాత, హైదరాబాద్:
BJP vs Regional Parties | దేశంలో ప్రాంతీయ పార్టీలను క్రమంగా మట్టుబెట్టే పనిలో బీజేపీ ఉందనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించి.. రాజ్యసభకు పంపుతున్నది. పదోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలలకే నితీశ్‌కుమార్ ఆ పదవి నుంచి వైదొలగబోతున్నారు. నిజానికి బీహార్ ఎన్నికల సమయంలోనే నితీశ్‌ను పక్కనపెడతారన్న అంచనాలు వచ్చాయి. ఆ అంచనాలను బీజేపీ నిజం చేసింది. కాకపోతే.. ఇది తన ఇష్టాన్ని నెరవేర్చుకునే క్రమంలో తీసుకున్న నిర్ణయంగా నితీశ్‌కుమార్ చెబుతున్నారు. ఈ నిర్ణయానికి ఫలితంగా నితీశ్ కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బీజేపీ చాణక్యం కారణంగానే నితీశ్ ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందనే చర్చలు సాగుతున్నాయి. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోనూ బీజేపీ ఇదే పని చేసింది. పార్టీ నుంచి షిండే వర్గం చీలిపోయినప్పుడు షిండేకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన బీజేపీ.. తర్వాతి ఎన్నికల్లో ప్లేటు ఫిరాయించింది. షిండేను కాదని, ఫడ్నవీస్‌ను ఆ కుర్చీలో కూర్చొనబెట్టింది. ఇది శివసేనకు కోలుకోలేని దెబ్బే. మున్ముందు కూడా మిగతా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను ఇదే క్రమంలో మింగేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకే పార్టీలను కోలుకోని విధంగా దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేరళ రాష్ట్రంలో కూడా పాగా వేయాలని బలంగా ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే కేరళ స్టోరీ–2ను బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ మరింత దుర్బర స్థితిలో వెళ్లి కోలుకోని విధంగా తయారవుతాయిన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే అస్సాంలో అసోమ్ గణ పరిషత్ (ఏజీపీ), గోవాలో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) , పంజాబ్‌లో అకాలీదళ్, మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలను తన అంగ, అర్థ బలాలతో దాదాపు కనుమరుగయ్యేలా చేసిన విషయం తెలిసిందే. దేశంలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మిత్ర పక్షాలతో కలిసి ఏపీ, బీహార్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కింలో అధికారం పంచుకుంటున్నది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్, పంజాబ్, జార్ఖండ్, మిజోరంలో ప్రాంతీయ పార్టీలు, కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. వీటిని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కమలం పార్టీ తహతహలాడుతున్నది.
తాజాగా బీహార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను రాజ్యసభకు పంపించేందుకు నామినేషన్ వేయించింది. రాజ్యసభ ఫలితాల తరువాత ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీహార్‌లో జేడీయూ, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నది. గతేడాది నవంబర్ లో 243 సీట్లకు జరిగిన ఎన్నికల్లో జేడీయూ 85 స్థానాలు, బీజేపీ 89 స్థానాలను దక్కించుకుని సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రలుగా బీజేపీ నుంచి సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు.
అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యత్వానికి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు అయి నాలుగు నెలలు కూడా గడవక ముందే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనుండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. బీహార్‌కు పదిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు ఇలా జరిగిందేమిటని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఈయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరిని బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతున్నది.
ఓబీసీలోని కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్‌కు రాష్ట్రంలో మంచి పట్టు ఉండటం, సామాజిక వర్గం కలిసి వచ్చాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర హోం శాఖ స్వతంత్ర మంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా వినిపిస్తున్నది. కొద్ది రోజుల్లోనే నితీశ్ వారసుడు ఎవరనేది బీజేపీ నాయకత్వం ప్రకటించనున్నది. నితీశ్ తనయుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం అవుతారని తెలుస్తున్నది. రానున్న ఎన్నికల నాటికి నితీశ్ ప్రభావం అంతగా లేకుండా చేసి, బీహార్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలన్న దూరాలోచన ఈ నిర్ణయం వెనుక ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పొత్తులు లేకుండా సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పాచికలు వేయడం మొదలుపెట్టిందంటున్నారు. ఆ క్రమంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.
ఈ ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు పార్టీలు ఆ రాష్ట్రాల్లో బలంగా పాతుకుపోయి ఉన్నాయి. గడచిన ఏడాది కాలంగా ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ అగ్రనాయత్వం దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలలో ఒక నెల అటుఇటుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఎలాగైనా ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలనే పట్టుదలతో కాషాయదళం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరాడింది. సువేందు అధికారి నాయకత్వంలో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే పట్టుదలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. గత రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజకీయంగా ముప్పు తిప్పలు పెడుతున్నది. ఎడ్డెం అంటే తెడ్డెం అనే విధంగా గవర్నర్ వ్యవహారంగా ఉంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితులు కల్పించారు.
వరుసగా మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన మమతపై కొంత వ్యతిరేకత వచ్చిందంటున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా బెంగాల్‌లో స్వతంత్రంగా పోటీచేసే ఆలోచనలో ఉంది. ఇది కూడా బీజేపీకి లాభించే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒంటరిగా కాంగ్రెస్ పోటీచేసిన ఎఫెక్ట్… ఆప్‌పై గట్టిగానే పడింది. ఇప్పుడు బెంగాల్‌లో కూడా కాంగ్రెస్ రంగంలోకి దిగితే పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందాన.. రాజకీయంగా బీజేపీ లాభపడుతుందని అంటున్నారు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే డీఎంకే అధికారంలో ఉన్నది. జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే దాదాపు అవసాన దశలో ఉన్నది. ఇటీవలే జయలలిత నమ్మినబంటు పన్నీర్‌సెల్వం ఏకంగా డీఎంకేలో చేరిపోయారు. అంతకు ముందే శశికళ.. సొంత పార్టీ పెడతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కోలుకోవడం సంగతి పక్కనపెడితే.. కనుమరుగయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే సెక్యులర్ నినాదంతో సినీ నటుడు విజయ్ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. డీఎంకే ఓటు బ్యాంకును చీల్చేందుకేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈయన వెనకాల బీజేపీ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ రెండు మూడు రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ చిదంబరం, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితో చర్చలు జరిపి 28 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. మిగతా కలిసి వచ్చే పార్టీలతో స్టాలిన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఏఐఏడీఎంకే తో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధమైంది. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిగ వెట్రి కళగం పోటీ చేసి.. తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి గట్టిగా ప్రయత్నించి మరింత పెట్టు పెంచుకోవడం కోసం బీజేపీ నిమగ్నమై ఉంది. స్టాలిన్ వయస్సు మీరిందని, ఇక ఆయన శకం ముగిసిందంటూ ఇప్పటికే తమిళ ఓటర్లలో బలంగా నాటుకుపోయేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నది. సనాతన ధర్మం కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నది.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల తరువాత కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టడం లేదా బలహీనపర్చడం ప్రధాన లక్ష్యంగా బీజేపీ పెట్టుకున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
