బీహార్ ఎన్డీయే గెలుపులో ఆ 7,500 కోట్ల పాత్రే కీలకం!
బీహార్ ఎన్నికల్లో ఇతర అంశాలను అన్నీ పక్కనపెడితే.. ఎన్డీయే కూటమి విజయంలో అత్యంత కీలకమైనది సీఎం మహిళా రోజ్‌గార్ యోజన కింద 7,500 కోట్ల రూపాయలను విడుదల చేయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఎన్నికల కమిషన్ ఫలితాల ప్రకారం 204 సీట్లు కైవసం/ఆధిక్యం కాగా.. అందులో బీజేపీ 93, జేడీయూ 83, లోక్ జనశక్తి 19, హిందుస్థాన్ అవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్‌దళ్ మోర్చా 4 చొప్పున గెలుపొందాయి. అయితే ఈ ఎన్నికల్లో మహిళలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూకు హారతి పట్టారు. బీజేపీ అభ్యర్థుల విజయంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకమైనదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ఈ సంవత్సరం ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ పథకం కోసం రూ.7,500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని 1.2 కోట్ల మంది మహిళలకు దీని ద్వారా లబ్ధి చేకూరింది. ఒక్కో మహిళ బ్యాంకు ఖాతాలో రూ.10వేల చొప్పున జమ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈ పథకాన్ని ప్రారంభింప చేయించడంతో రెండు పార్టీలకు ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. ఒక విధంగా ఎన్నికలకు ముందు అధికారికంగా డబ్బులు ఈ పేరుతో పంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పెరిగిన మహిళా ఓటింగ్
2006 సంవత్సరంలో గ్రామ పంచాయతీ పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్, 2013లో ప్రభుత్వ ఉద్యోగాలలో 35 శాతం కోటా అమలు చేశారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురుషులు 62.98 శాతం, మహిళలు 71.78 శాతం ఓటు వేశారు. తమ బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడంతో మురిసిపోయిన గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలు మరో ఆలోచన లేకుండా ఎన్డీఏ అభ్యర్థులకు గుడ్డిగా ఓట్లు వేశారు. దీంతో ఏన్డీఏ అభ్యర్థుల విజయం సునాయసమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పదోసారి నితీశ్ సీఎం అవుతారా!
గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో జేడీయు రెట్టింపు సంఖ్యలో సీట్లను గెలుపొందింది. ఈ సారి ఆయన సీఎం పదవి చేపడితే పదోసారి అవుతుంది. తొలిసారి 2000 సంవత్సరంలో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ పదవిలో కేవలం వారం రోజులు మాత్రమే పనిచేశారు. తిరిగి 2005 సంవత్సరంలో రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి, ఇప్పటి వరకు కొనసాగారు.1995 లో తొలిసారి హర్నాట్ నియోజకవర్గం నుంచి గెలుపొంది, ఆ తరువాత ఎక్కడా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. 1990 నుంచి 2004 సంవత్సరం వరకు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. నితీశ్ పాట్నా జిల్లాలోని భక్తియార్ పూర్ లో 1951 సంవత్సరంలో జన్మించారు. బీహార్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి బీఎస్సీ (ఇంజినీరింగ్) డిగ్రీ పట్టా తీసుకున్నారు. అయితే మరోసారి కూడా నితీశ్‌కు సీఎం పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర మోడల్ రిపీట్ అవుతుందనే అనుమానాలు ఉన్నా.. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అసహాయ స్థితిలో ఉంది. సొంతగా మెజార్టీ లేకపోవడంతో జేడీయూ, టీడీపీ మద్దతుపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో సీఎం పదవి కోసం కేంద్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపర్చుకునేందుకు బీజేపీ సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ సాహసం చేస్తే దేశంలో కొత్త రాజకీయ ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు.
Read Also |
Raghopur | మళ్లీ ముందంజలోకి తేజస్వి యాదవ్.. పదివేలకుపై ఓట్ల మెజార్టీ
Prashant Kishor’s Jan Suraaj Party : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ వైఫల్యమెందుకు?
NDA : ఎన్డీఏ నెక్ట్స్ టార్గెట్.. బెంగాల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram