జగ్దీప్ ధన్‌ఖర్ రాజీనామా వెనుక? చర్చల్లోకి గడ్కరీ, నితీశ్ లింకులు!
శీతాకాల సమావేశాల తొలి రోజే జరిగిన కొన్ని పరిణామాలను ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అందులో ఒకటి జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం.. రెండోది నితీశ్‌కు ఉప రాష్ట్రపతి పదవిని కేటాయించడం, మూడోది.. మోదీకి పోటీగా నిలువగలగిన నేత అనే అభిప్రాయాలునున్న నితిన్ గడ్కరీ రాజకీయ జీవితానికి ముగింపు పలకడం!

ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ ఆకస్మిక రాజీనామా పెను రాజకీయ దుమారాన్నే రేపుతున్నది. ఉదయం నుంచీ ప్రశాంతంగానే కనిపించిన ఆయన.. రాత్రి ఉన్నట్టుండి ఆరోగ్య కారణాలను చూపుతూ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం, తెల్లారికల్లా అది ఆమోదం పొందడం చకచక జరిగిపోయాయి. అయితే.. అనారోగ్యంతోనే రాజీనామా చేశారా? లేక బీజేపీలో అంతర్గత రాజకీయాలు ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించాయా? సోమవారం చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ఖిన్నుడై రాజీనామా ప్రకటించారా? అనే చర్చలు జోరందుకున్నాయి. జూలై 10న ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ధన్‌కర్.. దైవికంగా ఏమీ ఇబ్బందులు రాకపోతే తాను సరైన సమయంలో.. 2027లో రిటైర్ అవుతానని ప్రకటించారు. ఆ ఇబ్బందులు.. కొన్ని రోజులకే వచ్చేశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన తొలి రోజునే ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఆరోగ్య కారణాల రీత్యా అయి ఉండకపోవచ్చని, దీని వెనుక వేరే కథలు ఉండి ఉంటాయన్న అనుమానాన్ని కాంగ్రెస్ నాయకులు వెలిబుచ్చుతున్నారు. మొన్న మార్చి నెలలో ఢిల్లీలో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అయినా.. వెంటనే విధుల్లోకి వచ్చి, పార్లమెంటులో చురుకుగా పనిచేశారని పలువురు గుర్తు చేస్తున్నారు. శీతాకాల సమావేశాల తొలి రోజే జరిగిన కొన్ని పరిణామాలను ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అందులో ఒకటి జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం.. రెండోది నితీశ్‌కు ఉప రాష్ట్రపతి పదవిని కేటాయించడం, మూడోది.. మోదీకి పోటీగా నిలువగలగిన నేత అనే అభిప్రాయాలునున్న నితిన్ గడ్కరీ రాజకీయ జీవితానికి ముగింపు పలకడం! చివరి రెండు అంశాలే ప్రాతిపదిక అయితే ఆ నిర్ణయం ఏదో ముందే జరిగి ఉండేది కదా? అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అదే సమయంలో తాజా పరిణామంతో ఆ రెండింటిలో ఒకటి ఎంచుకునే అవకాశాలు ఉంటాయన్న అంచనాలూ వెలువడుతున్నాయి.
ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో సగం కాలిన నోట్ల కట్టలు పెద్ద మొత్తంలో బయటపడిన విషయం తెలిసిందే. దీనితో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ వర్మ ప్రకటించినప్పటికీ.. దీనిపై తీవ్ర స్థాయిలో రాజకీయ రగడ చోటు చేసుకున్నది. జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు ఎంపీలు అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు సహా 145 మంది తీర్మానం ఇస్తే.. రాజ్యసభలో 63 మంది ఇచ్చారు. అయితే.. రాజ్యసభలో ఇచ్చిన తీర్మానంపై సంతకాలు చేసినవాళ్లంతా ప్రతిపక్ష ఎంపీలేనని తేలడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. సోమవారం ఉదయం నుంచీ ఈ విషయంలో తిరిగిన అంశాలే ధన్‌కర్ రాజీనామాకు దారి తీశాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తీర్మానం చర్చకు వస్తే.. జడ్జీలు, న్యాయ వ్యవస్థలో అవినీతి సెంటర్ పాయింట్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.
సోమవారం యథావిధిగా ధన్‌ఖర్.. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. కొత్త సభ్యులతో ప్రమాణం కూడా చేయించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు ఎంపీలు ఇచ్చిన నోటీసును స్వీకరించారు. దానిపై చర్చకు తగిన ఏర్పాటు చేయాలని రాజ్యసభ అధికారులకు కూడా సూచించారు. బుధవారం జైపూర్ పశ్చిమ నగరంలో ఉపరాష్ట్రపతి హోదాలో ఒక కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకావాల్సి ఉన్నది. కానీ.. సోమవారం సాయంత్రమే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా రాజకీయ దుమారం రేపింది. సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశానికి కేంద్ర మంత్రులు కిరిణ్ రిజిజు, జేపీ నడ్డా హాజరుకాకపోవడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ప్రతిపక్ష ఎంపీలు అంటున్నారు. ఇదే సమావేశంలో రాజ్యసభలో తీర్మానంపై చర్చకు సమయాలను కేటాయించాల్సి ఉన్నది. ఒకవైపు లోక్‌సభలో ప్రభుత్వం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్షాల నోటీసుకు ఆమోదం తెలియజేయడం కేంద్రాన్ని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు. నడ్డా, రిజిజు హాజరుకాకపోవడం ప్రభుత్వ అసంతృప్తిని వెల్లడించే సంకేతంగా భావిస్తున్నారు. దీనికి తోడు సోమవారం జేపీ నడ్డా రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడుతున్న సమయంలో ‘నేను మాట్లాడేది మాత్రమే రికార్డుల్లోకి వెళుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య సభను నడిపే సభాపతి స్థానాన్ని అగౌరవపర్చడమేనని కొందరు అభిప్రాయపడ్డారు. ఇది కూడా ధన్‌కర్‌ను అసంతృప్తికి గురిచేసిందని చెబుతున్నారు. అయితే.. ఈ వాదలను నడ్డా మంగళవారం కొట్టిపారేశారు. వేరే పనిలో ఉన్నందున తాము సమావేశానికి వెళ్లలేదని, ఆ విషయాన్ని తామిద్దరం ముందే ధన్‌కర్‌కు తెలియజేశామని చెప్పారు. తాను మాట్లాడేది మాత్రమే రికార్డుల్లోకి వెళుతుందని తాను చెప్పినది కూడా ప్రతిపక్ష సభ్యులు అంతరాయం కలిగిస్తున్న సమయంలో చెప్పిందేనని వివరణ ఇచ్చారు. అంతేకానీ.. చైర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాదన్నారు.
నితీశ్‌ను ఉప రాష్ట్రపతిని చేసేందుకా?
బీహార్ ఎన్నికలకు ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షమైన జేడీయూ అధినేత ఒకటి నితీశ్ కుమార్‌ను బీజేపీ ఉప రాష్ట్రపతిని చేయాలని భావిస్తున్నదని ఒక వాదన వినిపిస్తున్నది. ఈసారి బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి ఉండాలనే అభిప్రాయం ఆ పార్టీ హైకమాండ్‌లో బలంగా కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నితీశ్‌ను బుజ్జగించడానికి ఆయనను ఉప రాష్ట్రపతిగా చేసే వ్యూహం ఉండచ్చని అంటున్నాయి. ఈ వాదనకు బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. ‘నితీశ్ కుమార్‌ను ఉప రాష్ట్రపతిని చేస్తే అది బీహార్‌కు ఎంతో ఉపయోగం’ అని ఆయన మీడియాతో అన్నారు. బీహార్‌లో ఇంత వరకూ బీజేపీ సొంతగా ప్రభుత్వాన్ని ఎన్నడూ ఏర్పాటు చేయలేదు. ఈసారి ఎలాగైనా బీహార్‌లో పాగా వేయాలనేది కమలం పార్టీ పట్టుదలగా చెబుతున్నారు.
గడ్కరీ రాజకీయ జీవితాన్ని ముగించే ప్లాన్?
రాజకీయ నాయకులు 75 ఏళ్ల వయసు వచ్చాక స్వచ్ఛందంగా తమ పదవులు, బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు కూడా ఆ సమయంలో వినిపించాయి. కేంద్రంలో మోదీకి దీటైన నాయకుడన్న అభిప్రాయం సంఘ్‌తో గట్టి సంబంధాలు ఉన్న నితిన్ గడ్కరీపై ఉన్నాయి. బీజేపీ, ఆరెస్సెస్ మధ్య సుహృద్భావ వాతావరణం లేదన్న వార్తలు వస్తున్నాయి. మోదీ తరువాత గట్టి నాయకుడైన గడ్కరీకి ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కొందరు అంటున్నారు. దీంతో గడ్కరీని రాజకీయాలకు పూర్తిగా దూరం చేసే ఉద్దేశం కూడా బీజేపీ అధినాయకత్వానికి ఉండి ఉండొచ్చని, అందుకే తాజా పరిణామాలను అందుకు ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. గతంలో బీజేపీ కీలక నేత వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతిగా చేయడం ద్వారా ఆయనను రాజకీయ రంగం నుంచి తప్పించారని, ఇప్పుడు అదే వ్యూహాన్ని గడ్కరీ విషయంలోనూ అమలు చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందుకు గడ్కరీ అంగీకరిస్తారా? తన రాజకీయ జీవితానికి ముగింపు పలికే పదవిని తీసుకుంటారా? బీజేపీ నాయకత్వంతో అసంతృప్తితో ఉన్న ఆరెస్సెస్ అందుకు ఒప్పుకొంటుందా? అనేది వేచి చూడాలి.