పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదటి భర్త, డెలివరీ బాయ్
Karnataka | ఓ మహిళ నిత్య పెళ్లి కూతురిగా అవతారమెత్తింది. మొదటి భర్తతో ఇద్దరు పిల్లలను కన్నాక.. అతన్ని వదిలేసింది. ఇక డెలివరీ బాయ్‌ను తన బుట్టలో వేసుకుని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇతన్ని కూడా కాదని ముచ్చటగా మూడో వ్యక్తితో జంప్ అయింది. ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని బెంగళూరు రూరల్ జిల్లా( Bengaluru Rural District )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు రూరల్ జిల్లా( Bengaluru Rural District ) దొడ్డబళ్లాపూర్ తాలుకా( Doddaballapur taluk) పరిధిలోని కుప్పన్ గ్రామానికి చెందిన సుధారాణికి కొన్నేండ్ల క్రితం వీరేగౌడ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇక సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. వీరేగౌడకు కారు, బుల్లెట్ బైక్ నడపడం రాదని చెప్పి.. అతన్ని వదిలేసి వెళ్లిపోయింది సుధారాణి. ఇద్దరు పిల్లలు కూడా వీరేగౌడ వద్దనే వదిలేసి వెళ్లిపోయింది.
ఇక ఓ డెలివరీ బాయ్‌ను తన బుట్టలో వేసుకుని ప్రేమిస్తున్నట్టు చెప్పింది. తన మొదటి భర్త చనిపోయాడని నమ్మబలికింది. తనకు తోడు కావాలని, నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు వలకబోసింది. నిజమే అని భావించిన డెలివరీ బాయ్ అనంతమూర్తి.. పెళ్లికి అంగీకరించాడు. ఓ ఆలయంలో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక రెండో భర్తతో దాదాపు రూ. 20 లక్షల వరకు ఇప్పించుకుని తన ఖాతాలో వేసుకుంది.
ఇక రూ. 20 లక్షలు తీసుకున్న ఆమె.. అనంతమూర్తిని దూరం పెట్టింది. మెల్లిగా అతన్ని కట్ చేసింది. అదే కర్ణాటకలోని కనకపురానికి చెందిన మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుని సుధారాణి పరారైంది. దీంతో దొడ్డబళ్లాపూర్ పోలీసులకు తన భార్య సుధారాణిపై మొదటి భర్త ఫిర్యాదు చేశాడు. కాసేపటికే రెండో భర్త అనంతమూర్తి కూడా అదే పీఎస్‌లో సుధారాణి అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. ఇద్దరు కూడా సుధారాణిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాకయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధారాణి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
