Stray Dogs | వీధి కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు వాటికి విషంతో కూడిన ఇంజెక్షన్లు ఇచ్చి చంపారన్న ఆరోపణల నేపథ్యంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదైంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని కిష్టాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.
జంతు సంక్షేమ కార్యకర్త ఏ గౌతమ్ కథనం ప్రకారం.. మార్చి 7 -8 తేదీల్లో కిష్టాపూర్ గ్రామంలో 100 వీధి కుక్కలకు విషంతో కూడి ఇంజెక్షన్లు ఇచ్చారు. గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కలిసే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కుక్కలను చంపేందుకు ఇద్దరు వ్యక్తులను నియమించుకున్నారు. వారు దొరికిన కుక్కకు దొరికినట్టు విషపూరిత ఇంజెక్షన్లు ఎక్కించారు. దీంతో కుక్కలు చనిపోయాయి. కుక్కల కళేబరాలను స్థానికంగా ఉన్న నది ఒడ్డున పూడ్చిపెట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గౌతమ్ పేర్కొన్నాడు.
గౌతమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీఎన్ఎస్, ఏనిమల్ యాక్ట్ కింద జన్నారం పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పేర్లను కూడా చేర్చారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
