Site icon vidhaatha

Supreme Court | విడాకులు పొందిన ముస్లిం మహిళ భరణం కోరవచ్చు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ : విడాకులు పొందిన ముస్లిం మహిళ సీఆర్పీసీలోని 125వ సెక్షన్‌ ప్రకారం తన భర్త నుంచి భరణం పొందే హక్కు కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. తన మాజీ భార్యకు పదివేలు మధ్యంతర మెయింటనెన్స్‌ కింద ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒక ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసై ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

సీఆర్పీసీ 125వ సెక్షన్‌ కింద ఏదైనా దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో ముస్లిం మహిళ విడాకులు పొందినట్టయితే ఆమె ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) చట్టం 2019ని కూడా ఆశ్రయించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ‘పెళ్లయిన మహిళలకే కాకుండా.. మహిళలందరికీ సీఆర్పీసీ సెక్షన్‌ 125 వర్తింస్తుందనే ప్రధాన నిర్ధారణతో క్రిమినల్‌ అప్పీలును కొట్టివేస్తున్నాం’ అని తీర్పు వెలువరిస్తూ జస్టిస్‌ నాగరత్న పేర్కొన్నారు.

అసలు కేసేంటి?

2017లో విడాకులు తీసుకున్న తన భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ పిటిషనర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత సమద్‌ను నెలకు 20వేలు భరణంగా ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దానిని ఆయన తెలంగాణ హైకోర్టులో సవాలు చేశారు. తాము ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం విడాకులు తీసుకున్నందున ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు చెల్లవని వాదించారు. ముస్లిం మహిళల (వివాహ హక్కుల) చట్టం 1986 ప్రకారం.. విడాకులు పొందిన ముస్లిం మహిళ సీఆర్పీసీ 125 సెక్షన్‌ ప్రకారం ఎలాంటి భరణం పొందేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. భరణాన్ని నెలకు పదివేలకు కుదించింది. ఈ తీర్పును పిటిషనర్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు

Exit mobile version