ఇప్పటికే రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాజీనామా
అదే బాటలో రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం?
కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులకు యత్నం!
బెంగళూరు : బీజేపీతో పొత్తును కొందరు జేడీఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. సెక్యులర్ పార్టీ అని పేరు పెట్టుకుని.. మతోన్మాద పార్టీతో అంటకాగడమేంటని నిలదీస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలో జేడీఎస్ తరపున ఉన్న నాయకులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. తాజాగా కర్ణాటక జేడీఎస్ మైనార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం.. ఈ విషయంపై చర్చించేందుకు సన్నిహితులు, అనుచరులతో అక్టోబర్ 16న సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తున్నది.
ప్రత్యేకించి మైసూర్ ప్రాంతంలోని నరసింహరాజ నియోజకవర్గంలో మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు కీలక మంత్రుల ద్వారా కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో సమావేశం కోసం ఇబ్రహీం ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బీజేపీ-జేడీఎస్ పొత్తును నిరసిస్తూ నరసింహరాజ నియోజకవర్గంలో దాదాపు 100 మంది జేడీఎస్ ఆఫీస్ బేరర్లు పార్టీకి రాజీనామా చేశారు.
ఇందులో కీలక నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ కూడా ఉన్నారు. ఈయన నరసింహరాజ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ‘దేశవ్యాప్తంగా ముస్లింలను బీజేపీ, ఆరెస్సెస్ టార్గెట్ చేస్తున్నాయి. వారిని వేధిస్తున్నాయి. మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నది’ అని ఖాదర్ చెప్పారు. ఈ మధ్యే పార్టీ సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సయీద్ షఫివుల్లా సాహెబ్ జేడీఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ అధికార ప్రతినిధి యూటీ ఫర్జానా అష్రఫ్ కూడా గుడ్ బై చెప్పారు.