Manpreeth Kour | ఉన్నత చదువుల కోసం 2020లో ఆస్ట్రేలియాకు.. నాలుగేళ్ల తర్వాత తిరిగొస్తూ అనంతలోకాలకు..!

Manpreeth Kour | ఆమె ఉన్నత చదువుల కోసం 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లింది. చదువు పూర్తిచేసుకుని దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరుగు పయనమైంది. చాలాకాలం తర్వాత కన్నవాళ్లను చూడబోతున్నానన్న ఆనందంతో విమానం ఎక్కింది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా నాలుగేళ్ల తర్వాత బిడ్డను చూసుకోబోతున్నామన్న ఆనందంతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. బిడ్డ కంటే ముందే బిడ్డ మరణవార్త భారత్‌కు చేరింది.

  • Publish Date - July 2, 2024 / 09:43 AM IST

Manpreeth Kour : ఆమె ఉన్నత చదువుల కోసం 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లింది. చదువు పూర్తిచేసుకుని దాదాపు నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి తిరుగు పయనమైంది. చాలాకాలం తర్వాత కన్నవాళ్లను చూడబోతున్నానన్న ఆనందంతో విమానం ఎక్కింది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా నాలుగేళ్ల తర్వాత బిడ్డను చూసుకోబోతున్నామన్న ఆనందంతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైంది. బిడ్డ కంటే ముందే బిడ్డ మరణవార్త భారత్‌కు చేరింది. జూన్ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన మన్‌ప్రీత్‌ కౌర్‌ 2020లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. అప్పుడు ఆమె వయస్సు 20 ఏళ్లు. కుకింగ్ అంటే ఇష్టపడే మన్‌ప్రీత్‌కు చెఫ్ కావాలనేది కల. ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తూనే.. వంటకు సంబంధించిన కోర్సులు చేసింది. కొవిడ్ సమయంలో ఆస్ట్రేలియాలోనే ఉంది. కఠిన పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంది. సుమారు నాలుగేళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయల్దేరింది.

జూన్‌ 20న మెల్‌బోర్న్‌ విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వచ్చే క్వాంటాస్ విమానం ఎక్కింది. విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో విమానం టేకాఫ్‌ కావాల్సి ఉండగా.. సిబ్బంది సీటు బెల్టులు పెట్టుకోవాలని ప్రయాణికులకు సూచించారు. అందరూ పెట్టుకున్నా మన్‌ప్రీత్‌ పెట్టుకోలేదు. దాంతో సిబ్బంది ఆమెను కదిలించి చూడగా ముందుకు పడిపోయింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. విమానం ఎక్కిన కాసేపటికే ఆమె మరణించింది.

అయితే మన్‌ప్రీత్ కౌర్‌ కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితుడు, రూమ్‌మేట్ కుల్దీప్ తెలిపాడు. వాస్తవానికి ఎయిర్‌పోర్టుకు వచ్చే సమయంలోనే మన్‌ప్రీత్ అస్వస్థతకు గురైందని అతను చెప్పాడు. అయితే ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, దాంతో ప్రయాణానికి సిద్ధమై భారత్‌కు బయలుదేరిందని కుల్దీప్ తెలిపాడు.

Latest News