Site icon vidhaatha

Anasuya Sengupta | అనసూయకు కేన్స్‌ ఉత్తమ నటి అవార్డు

ఆ అవార్డు అందుకున్న తొలి భారతీయరాలు
‘ది షేమ్‌లెస్‌ స్టార్‌’లో నటించిన అనసూయ సేన్‌ గుప్తా

కోల్‌కతా: కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ 2024లో తొలిసారి ఒక భారతీయ నటికి ఉత్తమ నటి అవార్డు దక్కింది. బల్గేరియా దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ రూపొందించిన ‘ది షేమ్‌లెస్‌ స్టార్‌’ సినిమాలో నటించిన అనసూయ సేన్‌ గుప్తా అన్‌సర్టైన్‌ రిగార్డ్‌ సెగ్మెంట్‌లో ఈ ఘనత సాధించింది. ఇద్దరు సెక్స్‌ వర్కర్ల జీవిత ప్రయాణం ఎలా సాగిందనే ఇతివృత్తంతో రూపొందించిన ది షేమ్‌లెస్‌ స్టార్‌ సినిమాను కేన్స్‌లో మే 17న ప్రదర్శించారు. ఈ సినిమాలో రేణుక అనే సెక్స్‌వర్కర్‌ పాత్రలో అనసూయ సేన్‌గుప్తా నటించింది. ఢిల్లీ వేశ్యావాటికలో ఒక పోలీసును హత్య చేసి ఆమె పారిపోతుంది. సెక్స్‌వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది.

అక్కడ ఆమెకు దేవిక అనే యువతి పరిచయం అవుతుంది. దేవిక కూడా బలవంతంగా ఈ రొంపిలోకి వచ్చిన యువతి. వారిద్దరి కథ ఈ సినిమా. తనకు వచ్చిన అవార్డును స్వీకరించిన అనసూయ సేన్‌గుప్తా.. దానిని వేశ్యావృత్తిలో కునారిల్లిపోతూ, తమ హక్కుల కోసం పోరాడుతున్నవారికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ‘సమానత్వం కోసం పోరాడటానికి మీరేమీ విచిత్రంగా ఉండాల్సిన అవసరం లేదు. వలసరాజ్యం దయనీమైనదని తెలుసుకునేందుకు వలస రాజ్యానికి పోవాల్సిన పనిలేదు. మనం మంచితనంతో కూడిన మానవులం అయితే చాలు’ అని ఆమె పేర్కొన్నారు.

కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌ గుప్తా.. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2013లో ముంబైకి వచ్చిన ఆమె.. కొన్ని ప్రాజెక్టులకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేశారు. 2016లో సంజీవ్‌ శర్మ రూపొందించిన ‘సాత్‌ ఉచాక్కే’, 2021లో సత్యజిత్‌రే కథల ఆధారంగా శ్రీజిత్‌ ముఖర్జీ తీసిన యాంథాలజీ ‘ఫర్‌గెట్‌మీ నాట్‌’ తదితర సినిమాలకు పనిచేశారు. 2009లో అంజన్‌ దత్తా దర్శకత్వం వహించిన ‘మాడ్లీ బెంగాలీ’ సినిమాలో సహాయ నటి పాత్ర పోషించారు.

Exit mobile version