Banda Jail | భయంతో పచ్చి టమాటలు తింటున్న బందా జైలు ఖైదీలు.. భయమెందుకో తెలుసా..?

  • Publish Date - April 4, 2024 / 07:19 PM IST

Banda Jail : గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్‌ ముఖ్తార్ అన్సారీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బందా జైలులో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. జైలులో తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చారని అన్సారీ కుమారుడు ఆరోపించారు. మరణానికి ముందు 40 రోజుల వ్యవధిలో ముక్తార్‌కు రెండుసార్లు విషం ఎక్కించారని ఆయన సోదరుడు అఫ్జల్అన్సారీ ఆరోపించారు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం అన్సారీ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే ముక్తార్ అన్సారీపై విషప్రయోగం చేశారనే వాదనల నేపథ్యంలో ఖైదీలు జైల్లో పెట్టే భోజనం తినాలంటే భయపడుతున్నారు. చాలామంది ఖైదీల్లో అన్సారీ మరణం భయంగా మారింది. తమపై కూడా విషప్రయోగం చేస్తారేమోననే అనుమానంతో ఖైదీలు ఆహారం తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సీనియర్ ఖైదీలు పచ్చి టమాటలను ఉప్పుతో కలుపుకుని తింటున్నారు. లేదంటే సాదా రోటీలతో కడుపు నింపుకుంటున్నారు. సాధారణ భోజనానికి దూరంగా ఉంటున్నారు.

ముక్తార్‌ అన్సారీపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు మీడియాలో రావడం, ఖైదీలు వాటిని జైల్లోని టీవీల్లో చూడటంతో వారిలో ఇలాంటి భయాలు మొదలయ్యాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ముక్తార్ అన్సారీ మరణంపై అనుమానం వ్యక్తంచేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మార్చి 28న ముక్తార్ అన్సారీ మరణం జైలులోని ఖైదీల్లో భయాన్ని పెంచిందని అధికారులు చెబుతున్నారు.

కాగా ఖైదీల్లో భయాన్ని పోగొట్టేందుకు జైలు సూపరింటెండెంట్‌తోపాటు సీనియర్ డాక్టర్లు వారితో మాట్లాడారు. ముక్తార్‌ ఆరోగ్య చరిత్ర గురించి, గతంలో రోపర్ జైలులో ఆయన రెండుసార్లు గుండెపోటుకు గురైన విషయాన్ని గురించి వారికి తెలియజేశారు. అన్సారీపై విష ప్రయోగం జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వివరించారు.

Latest News