Site icon vidhaatha

Dal Lake Shikara | ఉగ్రవాదాన్ని ఎదిరించిన మహిళ.. దాల్‌ లేక్‌లో బోట్‌ షికార్‌!

Dal Lake Shikara |

పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి.. కశ్మీర్‌ అంశాన్ని రగుల్చుతూనే ఉండాలనే పాక్‌ కుత్సిత కుట్ర కోణం నుంచే జరిగిందనేది వాస్తవం. దీన్ని కొందరు హిందూ, ముస్లిం తగాదాగా మార్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. కశ్మీర్‌ను ఒక ప్రమాదకర ప్రదేశంగా భారతీయుల్లో ముద్ర వేయడమే అంతిమంగా ఉగ్రవాదుల ఆలోచన. పహల్గామ్‌ ఘటన అనంతరం కశ్మీర్‌ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సొంత స్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. తమ అతిథులు వెళ్లిపోవడం బాధిస్తున్నదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వేదనతో వ్యాఖ్యానించారు. అయితే.. ఏ ఉగ్రవాదులు ఎంత మారణకాండ జరిపినా భారతీయులు భయపడబోరని ఒక మహిళ నిరూపించింది. దాన్ని మాటల్లో చెప్పడమే కాకుండా.. ఆచరణలో చూపింది. కశ్మీర్‌ ముమ్మాటికీ భారత్‌దేనని చాటిచెప్పింది.

ఉగ్రవాదులు దాడులు చేస్తున్నా.. నా భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌ నుంచి తాను వెళ్లేది లేదని ఉగ్రమూకలకు సవాలు విసిరింది. ఆ యువతి సాహసానికి యావత్‌ దేశం ఫిదా అయిపోతున్నది. ఆమె పేరు వినిత చైతన్య. బెంగళూరుకు చెందిన ఆ మహిళ వేసవి విహారం కోసం శ్రీనగర్‌ వచ్చింది. ఇంటీరియర్‌ డిజైనర్‌ అయిన వినిత చైతన్య సాధారణంగా కొత్త కొత్త డిజైన్లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటుంది. వాటితోపాటే లైఫ్‌స్టయిల్‌, ప్రకృతికి సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది. అయితే.. ఈ సారి ఆమె పోస్టు చేసిన అంశం చూసి అంతా విస్మయానికి గురయ్యారు. ఆమె సాహసాన్ని, తెగింపును, ఉగ్రవాదులకు చేసిన సవాలును చూసి.. అభినందించకుండా ఉండలేక పోతున్నారు.

పహల్గామ్‌ ఘటన అనంతరం పర్యాటకులు కశ్మీర్‌ను ఖాళీ చేసి వెళితే.. ఆ మహిళ మాత్రం ఉగ్రదాడులు జరిగినా తాను మాత్రం తన పర్యటనను రద్దు చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. మంగళవారం ఉగ్రదాడి జరిగింది. కానీ.. రెండు రోజులకే ఆమె తన ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్‌ చేసింది. అది.. శ్రీనగర్‌ ప్రసిద్ధ దాల్‌ లేక్‌లో బోటు షికారు చేస్తున్న దృశ్యం. ‘ఆత్మానుభూతిని మిగిల్చిన షికార’ అంటూ ఆమె ఈ పోస్టు పెట్టారు. ఆ రోజు ఉదయం సూర్యోదయాన్ని ఆమె దాల్‌ లేక్‌ బోట్‌ షికారు నుంచే ఆస్వాదించారు.

ఒకవైపు ఉగ్రదాడి నేపథ్యంలో సర్వత్రా నిస్సహాయత, హృదయవేదనలు నిండి ఉన్న వేళ.. దాల్‌ లేక్‌ అందాలను, అక్కడి ప్రకృతి వైభవాన్ని ఆమె తన వీడియోలో ప్రస్తావించారు. ఒక పెద్ద క్యాప్షన్‌ రాసిన వినిత.. ఏప్రిల్‌ 23నాటి పర్యవసానాలను పంచుకున్నారు. తాను బుక్‌ చేసుకున్న షికారను క్యాన్సిల్‌ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇదే వీడియోలో ఆమె స్థానిక కశ్మీరీ వ్యాపారులతో సంభాషించడం కనిపిస్తుంది, దాల్‌ లేక్‌ లో పడవ ప్రయాణం ఉంటుంది.. దాల్‌ లేక్‌ అందాలను ఆస్వాదిస్తున్న దృశ్యాలు ఉంటాయి. శ్రీనగర్‌ రావడానికి ముందే తాము షికార రైడ్‌ను బుక్‌ చేసుకున్నామని ఆమె తెలిపారు.

ఇదికూడా చదవండి..

పహల్గామ్ దాడితో.. మాకు సంబంధం లేదు: TRF ! పాక్ ఆర్మీ చీఫ్ సూచనలతోనేనా?

కొందరు ఆమె చర్యలను తిట్టిపోసినా మరికొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. కష్టకాలంలో అర్థవంతంగా వ్యవహరిస్తూ స్థానికులకు ఆమె మనోధైర్యం ఇచ్చారంటూ ప్రశంసించారు. ‘అక్కడ ఉన్నందుకు, కశ్మీరీ ప్రజలకు ఆశ నిలిపినందుకు థ్యాంక్యూ. ఆ దయ ఇప్పటికీ ఉంది..’ అని ఒకరు రాశారు. బుకింగ్‌ రద్దు చేసుకోవద్దని నిర్ణయించుకోవడం, స్థానికులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం బాగుంది. ఇలాంటివి మనం మరెన్నో చూడాలి..’ అని మరొకరు స్పందించారు. స్థానికులకు ఇలాంటి ప్రేమ అవసరమని, టూరిస్టులు భద్రతను ఫీల్‌ అవ్వాలని ఇంకొకరు రాశారు. కశ్మీర్‌లో జనజీవితం యథాతథంగా కొనసాగాలని, లేకుండా ఉగ్రవాదం గెలుస్తుందని ఆయన హెచ్చరించారు.

Exit mobile version