ఆ రాష్ట్రాల్లో క్లీన్‌స్వీప్‌ ఈసారి కష్టమే

  • Publish Date - April 11, 2024 / 06:58 PM IST

కాంగ్రెస్‌- ఎస్పీ క‌ల‌యికతో యూపీలో గ‌ట్టి పోటీ ఎదుర్కొంటున్న‌ బీజేపీ

గుజార‌త్‌లో బీజేపీని క‌లువ‌ర పెడుతున్న ఆప్- కాంగ్రెస్ క‌ల‌యిక‌

రాజ‌స్థాన్‌లో విభేదాలు మ‌రిచి క‌లిసి క‌ట్టుగా వెళుతున్న కాంగ్రెస్ నేత‌లు

అంటీముట్ట‌నట్లుగా ఉన్న బీజేపీ నేత వ‌సుంధ‌ర రాజే

విధాత‌: లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలన్న కమలనాథుల కళ‌ల‌కు యూపీ, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు దానికి గండి కొట్టబోతున్నాయా? అన్న సందేహాలు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. అంతేకాదు అధికారంలోకి రావాలంటే అవసరమైన 270 స్థానాలకు ఈ రాష్ట్రాలే కీలకం కానున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యూపీలోని 80 స్థానాల్లో గెలుపోటములు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 2014లో ఎన్నికల్లో బీజేపీ యూపీలో 42.63 శాతం ఓట్లతో 71 స్థానాలు గెలుచుకున్నది. 2019లో 49.97 శాతానికి ఓట్లు పెరిగినా 9 స్థానాలు తగ్గి 62 కి పడిపోయింది. అప్పుడు ఎస్సీ-బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. దీంతో ఆ ప్రభావం బీజేపీ ఓటు బ్యాంకుపై పడింది. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తున్నది. దీంతో బీజేపీ ఈసారి యూపీలో గట్టిపోటీని ఎదుర్కోబోతున్నది. దీనికితోడు 2019లో మోదీ హవాతో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిన 303 స్థానాల్లో 230 స్థానాల్లో లక్షకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ సమయంలోనే 50 వేల నుంచి లక్ష వరకు మెజారిటీతో బైటపడిన వివిధ రాష్ట్రాల్లో 37 మంది సిట్టింగ్‌ స్థానాలను నిలబెట్టుకోవడం కాషాయపార్టీ ముందున్న సవాల్‌. ఇందులో 13 స్థానాలు యూపీలోనే ఉండటం గమనార్హం. అందుకే బీజేపీ ఆర్‌ఎల్‌డీని కలుపుకున్నది. గడిచిన మూడు నెలల కాలంలో వివిధ పార్టీల నుంచి 14 మంది ఎంపీలు, ఐదుగురు మాజీ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. చేరార‌నేకంటే చేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. మార్చి 31 వరకు ఆపార్టీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాల్లో 25 మందికి అవకాశం దక్కింది. వీళ్లలో కొంతమంది పార్టీలో చేరకముందే టికెట్‌ ఇచ్చింది అంటే బీజేపీ గెలుపు కోసం పార్టీ సిద్ధాంతాలే కాదు అన్నీ పక్కనపెట్టింది.

గుజరాత్‌లో క్లీన్‌స్వీప్‌ కష్టమే

2019లో 63.07 శాతం ఓట్లతో గుజరాత్‌లోని 26\26 సీట్లను కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి కాంగ్రెస్‌-ఆప్‌ల కలయిక పెద్ద సవాల్‌గా మారింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌లు విడివిడిగా పోటీ చేశాయి. ఈ రెండుపార్టీలకు కలిపి వచ్చిన 40.2 శాతం ఓట్లు కంటే అధికంగా బీజేపీకి 52.50 శాతం ఓట్లతో ఏకంగా 182 అసెంబ్లీ సీట్లలో 156 స్థానాల్లో గెలిచి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నది. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్‌లోని 26 సీట్లలో కాంగ్రెస్‌ 24, ఆప్‌ 2 చోట్ల పోటీ చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభపడిందని ఇరుపార్టీల నేతలు భావించారు. ఈసారి తమ కూటమి ఓట్ల చీలికను నిలువరిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్‌ పోటీ చేస్తున్న భరూచ్‌, భావ్‌నగర్‌లో గెలుపు కోసం రెండు పార్టీల నేతలు కృషి చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ పోటీ చేస్తున్న 24 స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోకుండా మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై కాంగ్రెస్‌-ఆప్‌లు దృష్టి పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఎస్టీ నియోజకర్గమైన డేడియాపాడాలో విజయం సాధించింది. ఈ నియోజకవర్గం ఆప్‌ పోటీ చేస్తున్న భరూచ్‌ పరిధిలోకి వస్తుంది. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర వీటి మీదుగానే సాగింది. ఈ పరిణామాలన్నీ కాషాయపార్టీని కలవరపెడుతున్నాయి. అయితే కాంగ్రెస్‌-ఆప్‌ కలయిక ప్రభావం ఉండబోదు అని పైకి చెబుతున్నా ఈసారి గత ఎన్నికల వలె క్లీన్‌ స్వీప్‌ కాదు 15పైగా సీట్లు గెలుచుకుంటే చాలు అన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో వ్యక్తమౌతున్నట్టు సమాచారం.

ఎడారి రాష్ట్రంలో ఎదురీత

ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి క్లీన్‌స్వీప్‌ చేసింది. 2014లో 25\25 గెలుచుకున్నప్పుడు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. 2019లో అధికారంలో లేకున్నా మోదీ ఛరిష్మాతో మరోసారి మొత్తం సీట్లను తన ఖాతలో వేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వసుంధర రాజెను పక్కపెట్టి అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు. దీంతో ఆ వ్యూహం బెడిసి కొడుతుందని తెలిసిన తర్వాత ఆమె ఇచ్చిన 70 మందికి పైగా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కడం కోసమే అన్నది మోదీ-షాలు ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ పేరు ప్రకటించిన తర్వాత అర్థమైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాజె ఎక్కువగా కనిపించడం లేదు. సీఎం భజన్‌లాలే క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 5 లక్షల మెజారిటీతో పాటు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాజెకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. అలాగే ఇక్కడ బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందడనికి ఇద్దరి మధ్య విభేదాలే కారణమని వాటిని పక్కనపెట్టి మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌తో పాటు సచిన్‌ పైలట్‌లు కాంగ్రెస్‌ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. చురు, ఝుంఝునపూ, కరౌలీ-ధౌల్‌పుర్‌, టోంక్‌-సవాయీ, మాధోపూర్‌,బాడ్‌ మేర్‌లలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నది. వీటితో పాటు హనుమాన్‌ బేణీవాల్‌ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌ తాంత్రిక్‌ పార్టీ ( ఆర్‌ఎల్‌పీ) నాగోర్‌లో పోటీ చేస్తున్నది. అక్కడ బేణివాల్‌కు మద్దతు ప్రకటించి అభ్యర్థిని నిలుపలేదు. బాంస్‌వాడా-దుంగాపూర్‌లో భారతీయ ఆదివాసీ పార్టీకి (బీఏపీ)కి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్నది. బీజేపీ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా చిన్న పార్టీలను కలుపుకుని వెళ్తున్నట్టే కాంగ్రెస్‌ అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. దీంతో బీజేపీ గత ఎన్నికల్లో గెలిచిన చోట్ల ఇప్పుడు ఎదురీదాల్సి వస్తున్నది.

ఇట్లా యూపీ గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని (80\62+26\26+25\25) 131 స్థానాల్లో 113 గెలుచుకున్నది. ఈసారి వాటి నిలబెట్టుకుంటేనే కేంద్రంలో అధికారానికి అవసరమైన మెజారిటీ సాధ్యమౌతుంది. అలాగే ఆ పార్టీ ఆశిస్తున్న 370 సీట్లు కూడా వీటితో ముడిపడి ఉన్నాయి. కానీ కొన్ని రోజులుగా బీజేపీలో మారిన రాజకీయ పరిస్థితులు కాషాయపార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. యూపీలో బీజేపీ హిందుత్వవాదంతో పాటు ఓబీసీలోని ఉప కులాల ఓట్లను గంపగుత్తగా ఆ పార్టీ వైపు మళ్లించడంలో విజయవంతం అయ్యింది. అందుకే 2014లో 71, 2019లో 62 సీట్లను గెలుచుకోగలిగింది. కానీ హిందుత్వ వాదానికి వ్యతిరేకంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ రైతులు, దళితులు, మైనారిటీల వాదనకు తోడు కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలోని కుల గణన, రిజర్వేషన్ల సీలింగ్‌ ఎత్తివేత, ఈడబ్ల్యూఎస్‌లో అన్నికులాలకు అవకాశం వంటి ప్రభావం చూపెట్టనున్నాయి.

Latest News