President Droupadi Visit Sabarimala Temple | శబరిమలను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేరళ పర్యటనలో భాగంగా శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం నల్లటి వస్త్రాలు ధరించి, తలపై ఇరుముడితో 18 బంగారు మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

President Droupadi Visit Sabarimala Temple

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా బుధవారం శబరిమల ఆలయాన్ని సందర్శంచి అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం సాంప్రదాయాలను పాటిస్తూ..నల్లటి వస్త్రాలు ధరించి, తలపై ఇరుముడితో 18బంగారు మెట్లు ఎక్కి కొండపైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం. రాష్ట్రపతి వెంట ఉన్న సెక్యూరిటీ, భద్రతా సిబ్బంది సైతం ఇరుముడితోనే మెట్లు ఎక్కారు.. స్వామి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం పూజలు ముగిసే ముందు రాష్ట్రపతి సన్నిధానంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. తోటి పౌరుల శ్రేయస్సు, సంక్షేమం కోసం అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లుగా రాష్ట్రపతి ఎక్స్ లో పోస్టు చేశారు.

అయ్యప్పను దర్శించుకున్న రెండో రాష్ట్రపతి

శబరిమల ఆలయ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు రాష్ట్రపతులు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నారు. తొలుత 1973లో అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి, ఆయన కుమారుడుతోపాటు మరికొందరు ఎంపీలతో కలిసి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత 52ఏళ్ల అనంతరం రెండో రాష్ట్రపతిగా, తొలి మహిళా రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం విశేషం.

రాష్ట్రపతి శబరిమల పర్యటన క్రమం

ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రమదంకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌ రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో దిగుతుండగా హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం కొంత అందులో ఇరుక్కుపోయింది. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ద్రౌపది ముర్మును సురక్షితంగా హెలికాప్టర్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో పంబకు బయలుదేరారు. పంబా చేరుకుని గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. తలపై నైవేద్య కట్ట (ఇరుముడి) కట్టుకున్నారు. తర్వాత పంబ నుంచి సన్నిధానం వరకు కొండ మార్గంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గూర్ఖా జీపులో ప్రయాణించారు. సన్నిధానంలో ద్రౌపది ముర్ము 18 పవిత్ర మెట్లను ఎక్కి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు రాష్ట్ర మంత్రి వీఎన్ వాసవన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ స్వాగతం పలికారు. ఆలయ తంత్రి కందరారు మహేష్ మోహనర్ రాష్ట్రపతికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము ఇరుముడిని మోసుకుంటూ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. ద్రౌపది ముర్ము, ఆమె బృందం వారి పవిత్ర ఇరుముడులను ఆలయ మెట్లపై ఉంచారు. ఆ తర్వాత ప్రధాన పూజరి… పూజ కోసం వారి ఇరుముడికెట్టును స్వీకరించారు.
ప్రధాన పూజారి ఆలయం లోపల ప్రార్థనలు చేసి బయటకు వచ్చి ద్రౌపది ముర్ముకు పవిత్ర ప్రసాదం ఇచ్చారు. ఆలయంలో కాసేపు ప్రార్థనలు చేసిన ముర్ము ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు. దర్శనం తర్వాత సన్నిధానంలోని అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసున్నారు. అనంతరం తిరువనంతపురం బయలుదేరారు.