అమరావతి : విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని.. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనతంరం రాష్ట్రపతి ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని రాష్ట్రపతి అన్నారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని కొనియాడారు.
అంతకుముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. సాయంత్రం శ్రీసత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
