Rajagopal Reddy praises| మాట మార్చిన రాజగోపాల్ రెడ్డి !..సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు!!

మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదన్న అసహనంతో తరచూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించే రాజగోపాల్ రెడ్డి ఆదివారం అనూహ్యంగా నాలుక మడతేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.

విధాత : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి నాలుక మడతేశారు. మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదన్న అసహనంతో తరచూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించే రాజగోపాల్ రెడ్డి ఆదివారం అనూహ్యంగా నాలుక మడతేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో 200కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా రూ.16వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కుల్స్ నిర్మాణం చేయిస్తుండటం అభినందనీయమన్నారు. రేవంత్ రెడ్డి ఏ మంచిపని చేసినా ప్రశంసిస్తామని, సహకరిస్తామని, వెంట ఉంటామని అందులో ఎలాంటి అనుమానం అక్కరలేదన్నారు.

బీఆర్ఎస్ బర్లు, గొర్లు, చేప పిల్లలంటూ విద్యను నిర్లక్ష్యం చేసింది

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని, బర్లు, గొర్లు, చేప పిల్లల పంపిణీ పేరుతో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి పెట్టలేదని  రాజగోపాల్ రెడ్డి  విమర్శించారు. దీంతో విద్య మొత్తం కార్పోరేట్ చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ వేల కోట్ల అప్పులు తెచ్చి సీమాంధ్ర కాంట్రాక్టర్ల పాలు చేసిందని, ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.  సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని వర్గాల పిల్లలకు ఒకేచోట ఇంటర్నేషనల్ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించే ప్రయత్నం చేస్తుండటం అభినందనీయమన్నారు.  సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సభికులతో పాటు , హాజరైన కాంగ్రెస్, సీపీఐ పార్టీ శ్రేణులు సైతం  విస్మయం చెందారు.

స్వరం మార్పు వెనుక మతలబు ఏమిటో ?

మంత్రి పదవి రావడం లేదన్న అసహనంతో వీలైనప్పుడల్లా సీఎం రేవంత్ పై విమర్శలు చేసే రాజగోపాల్ రెడ్డి ఆయనను అభినందించడం అందరిని సహజంగానే ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సీఎ రేవంత్ రెడ్డి తెలంగాణకు రాజు నేనే, మంత్రి నేనే.. మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి వ్యతిరేమని మండిపడ్డారు.  మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం పదవినే నా టార్గెట్ అంటూ వ్యాఖ్యానించారు. అంతలా ..  రేవంత్ పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా పొగడ్తల రాగం అందుకోవడం ఏమిటన్నదానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

మునుగోడు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గమని, నియోజకవర్గం అభివృద్దికి నిధులను ఇవ్వడం లేదని కూడా రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన నియోజవర్గానికి 200కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం, డిండి ప్రాజెక్టు పనులకు టెండర్ల నేపథ్యంలో తాజాగా ఆయన సీఎంపై విమర్శలకు బ్రేక్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే  తన మంత్రి పదవికి సంబంధించి సానుకూల సంకేతాలు వచ్చిన నేపథ్యంలోనైనా.. రాజగోపాల్ రెడ్డి తన స్వరం మార్చి ఉండవచ్చన్న చర్చ వినిపిస్తుంది.

రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా మాది

సీఎం రేవంత్ రెడ్డిని పొగిడిన ఇదే సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా నల్లగొండ జిల్లా అని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని, రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్ వంటిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాటలు విన్న ఆయన వ్యతిరేకులు మాత్రం…ఎంతైనా కోమటి రెడ్డి బ్రదర్స్ సందర్బోచితంగా సన్నాయి రాగాలు పాడటంలో పండిపోయారంటూ సెటైర్లు వేస్తున్నారు.

Latest News