విధాత, హైదరాబాద్ : బంగారం ధరలపై పశ్చిమాసియా యుద్ధ మేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అని పెట్టుబడిదారులకు కూడా ఆందోళనలో పడిపోతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తుతుందనే భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సహజంగానే అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయి.
సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380తగ్గి రూ.1,52,460కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350తగ్గి రూ. 1,39,750వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000తగ్గి రూ. 2,60,000వద్ద కొనసాగుతుంది.
అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సాధారణంగా యుద్ధం లాంటి పరిస్థితులు ఎదురయితే బంగారం ధరలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇరాన్ యుద్ధం వేళ సీన్ తారుమారు అయింది. బంగారం ధరలు కుప్పకూలాయి. కొన్ని సార్లు అమాంతం పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా పసిడి ధరలు పతనమయ్యాయి. స్పాట్ గోల్డ్ ధర 2% తగ్గి ఔన్సుకు $4,700 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. స్పాట్ సిల్వర్ కూడా దాదాపు 2% పతనమై ఔన్సుకు $75 డాలర్ల కంటే తక్కువకు చేరింది. ముడి చమురు ధరలు మాత్రం 7% నుంచి 9% వరకు పెరిగి బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటాయి. యూఎస్ డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ బ్యారెల్ ధర దాదాపు $105 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర $102 డాలర్ల పైకి ఎగబాకింది. డాలర్ కూడా పుంజుకుని గత వారం నష్టాల నుంచి కొంత కోలుకుని 99 మార్కును దాటింది.
