విధాత : హజూర్ నగర్ ,కోదాడ నియోజకవర్గాలలో ఎత్తిపోతల పధకాలు వేగవంతంగా పూర్తి చేయాలని, ఖరీఫ్ -2026 నాటికి పూర్తికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా రైతులకు రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచే నిరంతర సాగునీరు అందేలా అన్ని పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆదివారం డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోనీ తన కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నీటిపారుదల అధికారులతో మంత్రి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్ , కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఎత్తిపోతల పధకాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, జవహర్ జనపహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వంటి ప్రధాన పథకాల స్థితిగతులను పరిశీలించారు. 53,000 ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ లక్ష్యంతో రూ. 1,642 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పురోగతిని ప్రత్యేకంగా సమీక్షించారు. అలాగే రూ. 292 కోట్ల వ్యయంతో 10,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన జవహర్ జనపహాడ్ బ్రాంచ్ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పురోగతిపై కూడా వివరాలు తెలుసుకున్నారు.
తన స్వస్థల నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో 2,041 ఎకరాలకు సాగునీరు అందించనున్న బెట్టే తండా ఎత్తిపోతల పథకంతో పాటు 3,200 ఎకరాలకు సాగునీరు అందించనున్న నక్కగూడెం ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న లిఫ్ట్ పథకాలను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
4,460 ఎకరాలు సేద్యంలోకి రానున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకం 5,000 ఎకరాలకు సాగునీరు అందించనున్న రాజీవ్ శాంతినగర్ లోని రాజీవ్ ఎత్తిపోతల పధకంతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నడిగూడెంలో 3,500 ఎకరాలకు నిరందించేందుకు గాను చేపట్టినఆర్-9 లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు వేగవంతంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ట్రాన్స్‌కో అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాన్స్‌ఫార్మర్ యార్డులు, విద్యుత్ సరఫరా సదుపాయాలు సమయానికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న నీటిపారుదల కార్యాలయ భవనాల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించారు . హుజూర్‌నగర్‌లో రూ. 7.99 కోట్లతో ఒకటి, కోదాడలో రూ. 5.12 కోట్లతో మరొకటి నిర్మిస్తున్నామన్నారు. ఈ భవనాల రూపకల్పన, నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని చీఫ్ ఇంజనీర్ నాగభూషణ్ రావును బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఓఎస్‌డీ ఇరిగేషన్ భీమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
