Chandrababu Naidu | అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు పట్ల హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలోని రైతులు, ప్రజలు వినూత్నంగా తమ అభిమానాన్ని ప్రదర్శించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు తీసుకరావడం పట్ల వారంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన సీఎం చంద్రబాబుకు తమ కృతజ్ఞతలు తెలిపేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
హంద్రీనీవా సుజల స్రవంతి పథకంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రాయలసీమ కరవు ప్రాంతాలకు అందించేందుకు 1,649 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తున్నారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వంలో ఆరు నెలల్లో జరిగిన పనులతో కుప్పం బ్రాంచి కాలువ చివర రామసముద్రం చెరువు వరకు కృష్ణమ్మ చేరింది. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రేపు శనివారం గంగపూజ చేయబోతున్నారు. ఈ పథకం కాలువల పొడవునా 19 నియోజకవర్గాల్లో 423 చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు. ఈ చెరువులన్నీ ఒకసారి నింపితే 13.004 టీఎంసీలు నిల్వ కానుంది. వాటి కింద 71,765 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది.
రాయలసీమ వరదాయిని హంద్రీనీవా
శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాల ఎత్తిపోయడం ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాల సాగు, చిత్తూరు జిల్లా 10 లక్షల మందికి తాగునీరు అందించడం హంద్రీనీవా ప్రాజెక్టు లక్ష్యం. ప్రధాన కాలువ 554 కిలో మీటర్లు, బ్రాంచి కాలువలు 344 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూటరీలు మినహా దాదాపు పనులు పూర్తయ్యాయి. 70చోట్ల ఎత్తిపోసేలా పనులు, రూ.24వేల కోట్ల ఖర్చు చేశారు. 2014-19 మధ్య హంద్రీనీవా విస్తరణ పనులు ప్రారంభించారు. రూ.4,317 కోట్లతో వెడల్పు పనులు మొదలుపెట్టి 47% పూర్తి చేశారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో పనుల ప్రణాళిక మార్చి, అంచనాలు పెంచినా ఒక్క రూపాయి పని కూడా చేయలేదు. హంద్రీనీవా కాలువలను లైనింగ్ చేయలేదు. ఫలితంగా రెండు దశలకు నీళ్లిచ్చినా పూర్తి ప్రవాహం టెయిలెండ్ కు చేరడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.2,226 కోట్లతో తొలిదశలో ప్రధాన కాలువ వెడల్పు పనులు, రెండో దశలో లైనింగ్, పుంగనూరు, కుప్పం బ్రాంచి కాలువల్లో లైనింగ్ పనులు ఒప్పంద విలువతో దాదాపు పూర్తి చేసి, నీళ్లు వదిలారు. కుప్పం వరకు నీళ్లు చేరడంతో అక్కడి రైతుల్లో, ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది.
