99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం

ప్రభుత్వం ఆర్భాటంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ కార్యక్రమం చిత్తశుద్ధితో సాగితేనే ఫలితాలొస్తాయని అంటున్నారు విశ్లేషకులు...

99 days programme cm revanth review

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
99 Day Prajapalana | గత ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలకు, కొన్ని నూతన పథకాలను జోడించి ఈ రెండున్నర సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన సందర్భంగా చేపట్టిన ప్రగతిపై ప్రత్యేక ముద్రవేసేందుకు ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీని అమలుకు రాష్ట్రంలో 99 రోజుల పాటు సుదీర్ఘ ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో రెండున్నరేళ్ళ తమ పాలనను సమీక్షించుకుంటూనే పాలనను గాడినపెడుతూ, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వద్దకు చేర్చేందుకు ఈ ఆర్భాట ప్రోగ్రాంను ఎంచుకున్నారనే చర్చసాగుతోంది. ఈ కార్యక్రమం అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయంతోపాటు ప్రజల వద్దకు వెళ్ళేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. దీని అమలులో చిత్తశుద్ధి ఉంటేనే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటంతోపాటు ప్రభుత్వానికి ఫలితాలొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైరేదైన ఈ కార్యక్రమం ఫలితంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్ళందుకు అవకాశం చిక్కుతోందని, దీని వల్ల ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అవకాశం లభిస్తోందని ఆశిస్తున్నారు. ఈ ప్రజాపాలనలో ప్రజాచైతన్యంతోపాటు సామాజిక, సమాజాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చారు ప్రారంభ, ఆరంభాలున్నప్పటికీ . పెద్దగా ఆర్ధిక భారం లేకుండా ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం గమనార్హం.

ప్రణాళిక ఓకే అమలే అసలు సమస్య

రాష్ట్రంలోని నలుగురితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని కేబినెట్లో చర్చించి ఆమోదించారు. దీని కోసం కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రతి అంశానికి, కార్యక్రమానికి నోడల్ అధికారిని నియమించారు. ప్రణాళిక రూపొందించడం మేరకు ఓకే కాని అమలు పైన్నే దీని ఫలితాలు ఆధారపడుతాయంటున్నారు. ఇప్పటికే మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రభుత్వానికంటే విపక్షాల విమర్శలే ప్రజల్లోకి ఎక్కువగా వెళుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో మంత్రులు,ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో సమన్వయంతోపాటు క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే సత్ఫలితాలొస్తాయని ఆశిస్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొక్కుబడిగా అమలు చేస్తే కాగితాలకే పరిమితమయ్యే అవకాశముందంటున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉమ్మడి జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులు సమావేశాలు నిర్వహించారు. అయితే సమావేశాలకు అధికారులు హాజరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడం గమనార్హం. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం మహబూబాబాద్ లో ఏర్పాటు చేస్తే ఈ సమావేశానికి మంత్రి సీతక్క, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, భూపాలపల్లి, జనగామ ఎమ్మెల్యేలు, వరంగల్ ఎంపీ హాజరుకాలేదు. కొందరు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.

మూడు నెలల సుదీర్ఘకాలం

99 రోజులు అంటే దాదాపు మూడు నెలల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయించి ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12వ తేదీ వరకు కొనసాగుతూ మధ్యలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం ఘనంగా నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పాలకవర్గాలు కొలుదీరాయి. మండల, జిల్లా పాలకవర్గాలు లేనప్పటికీ నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంత్రులు భాగస్వామ్యం ప్రధానం. ఈ మేరకు అధికారులతో సమన్వయం చేసుకోవడం పై ఆధారపడి ప్రజాప్రయోజనాలు వస్తాయంటున్నారు.

ఐదు దశల్లో కార్యక్రమాలు

ఐదు దశల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయి, ఏప్రిల్ 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయి, జూన్ 2న రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

పది అంశాలకు ప్రాధాన్యం

ఈ 99 రోజుల కార్యక్రమంలో పది అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ‘పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ళ పరిష్కారం’ మార్చి 6 నుంచి 15 తేదీ వరకు , ‘ఆరోగ్యం’ ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు, ‘సురక్షితంగా చేరుకోండి’ ఏప్రిల్ 13 నుంచి 18వ తేదీ వరకు, ‘సంక్షేమం’ ఏప్రిల్ 20 నుంచి 25 వ తేదీ వరకు, ‘పిల్లల భద్రత, రక్షణ, నో డ్రగ్స్’ ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు, ‘రైతులు’ మే 4 నుంచి 9వ వరకు, ‘విద్య’ మే 11 నుంచి 16వ వరకు, ‘యువత, క్రీడలు’ మే 18 నుంచి 23 వరకు, ‘మహిళలు’ మే 25 నుంచి 30 వరకు, ‘పర్యావరణం’ జూన్ 1 నుంచి 12 వరకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ ప్రధానాంశల్లో అన్ని రకాల ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు చర్చకు వచ్చే విధంగా జాగ్రత్త తీసుకున్నారు.

ప్రచారంతోపాటు కార్యక్రమాలకు బడ్జెట్

ఈ కార్యక్రమాల అమలుకు తగిన బడ్జెట్ కూడా కేటాయించారు. గ్రామపంచాయతీ/ మున్సిపల్ వార్డుకు రూ. 10వేలు, మండల/మున్సిపాలిటీకి రూ. 2లక్షలు, నియోజకవర్గానికి రూ. 10 లక్షలు, జిల్లా స్థాయిలో రూ. 50 లక్షలు, రాష్ట్ర స్థాయిలో రూ.10కోట్లు కేటాయించారు. ప్రచారానికి సంబంధించి సమాచార, పౌర సంబంధాల శాఖకు రూ. 20 కోట్లు కేటాయించడం గమనార్హం.

Latest News