- తమ పిల్లలను డాక్టర్లను చేసేందుకు 91% డాక్టర్ల తిరస్కరణ
- 6 నెలలపాటు.. 1,200 మంది డాక్టర్లతో సర్వేలో ఆసక్తికర విషయాలు
విధాత, హైదరాబాద్:
Medical Profession Survey | దేబబ్రత మితాలీ ఆరో ఫౌండేషన్ ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా పర్యటించి 1,200 మంది ఫిజిషియన్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ కేర్ రంగంలోని జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, చిన్న పిల్లల వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించి సర్వేలో 91 శాతం మంది డాక్టర్లు తమ వారసులను వైద్యవృత్తిలోకి దించేందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. పేరు ప్రఖ్యాతులతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ రంగాన్ని ఎంచుకున్నట్లు పలువురు తెలిపారు. అయితే రాను రాను ఆవేదన కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయని, భౌతిక, మానసిక వేధింపులు పెరిగాయని, న్యాయపరమైన చిక్కులు పెరగడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నారు.
గడచిన కొన్నేళ్లుగా హృదయం రగిలే విధంగా పరిస్థితులు తయారయ్యాయని 78 శాతం మంది డాక్టర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోల్చుకుంటే ఫిజిషియన్లపై ఒత్తిడి 29 శాతం ఉందని, రోగులు, వారి బంధువుల నుంచి 84 శాతం భౌతిక, వ్యక్తిగత దూషణలను ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. తమ వైద్యవృత్తిలో 67 శాతం మంది మెడికో లీగల్ కేసులు ఎదుర్కొన్నట్లు, ఇలాంటి కేసుల మూలంగా నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ సంతానాన్ని వైద్య కోర్సులలో చేర్పించేందుకు వెనకంజ వేస్తున్నామని వెల్లడించడం గమనార్హం.
ఇవే కాకుండా ఒకదానికి ఒకటి సంబంధం ఉండటం కూడా కారణంగా చెప్పారు. సుదీర్ఘ పని గంటలు అనగా వరుసగా రెండు మూడు రోజులు ఆసుపత్రులలో గడపడం.. పని ఒత్తిడి కారణంగా నిద్రలేని రాత్రులు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణాలతో అనుబంధాలు, ఆత్మీయతలు కోల్పోతున్నామని, కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని వెల్లడించారు. ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ విభాగాలలో రోగులు, వారి సహాయకులు అకారణంగా దాడులకు దిగడం, వ్యక్తిగతంగా దూషణలకు దిగడం చేస్తున్నారు. 84 శాతం మంది డాక్టర్లు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
మెడికో లీగల్ కేసుల బారి నుంచి బయటపడేందుకు అదనంగా డయాగ్నస్టిక్ టెస్టులు రాయడం మూలంగా న్యాయపరంగా చిక్కులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పది మంది ఫిజిషియన్లలో ఆరుగురుపై ప్రజలు అపనమ్మకం పెంచుకుంటున్నారన్నారు. డాక్టర్ల క్రమశిక్షణ, త్యాగాలను కూడా ప్రజలు గుర్తించడం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లపై ఒత్తిడి శాతం 29 ఉండగా, భారత్ లో మాత్రం 78 శాతం ఉందన్నారు. భారతదేశం కాకుండా అమెరికా, యూకే వంటి దేశాలలో కూడా డాక్టర్లు తమ పిల్లలను మెడిసిన్ కోర్సులో చేర్చేందుకు నిరాకరిస్తున్నారు. రోగులు, వారి బంధువుల నుంచే కాకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, అంచనాలకు మించి రోగులు ఆశించడం, సరైన భద్రతా సౌకర్యాలు కల్పించకపోవడం, రోగుల తాకిడి విపరీతంగా ఉండడం కూడా కారణాలుగా చెబుతున్నారు.
ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాలలో పనిచేస్తున్న వైద్యులు తమ పిల్లలకు మెడిసిన్ కోర్సులో చేర్పించేందుకు 91 శాతం మంది నిరాకరిస్తున్నారు. దీర్ఘకాలంగా పనిచేయడం మూలంగా ప్రతిభ అనేది సమాజానికి తెలియడం లేదనేది కూడా వాదన. గ్రామీణ ప్రాంతాలలో పోస్టింగ్ ఇవ్వడం కూడా ఒక కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం 1,456 మంది ప్రజలకు ఒక వైద్యుడు ఉండాలి కాని భారత్ లో అందుకు తగ్గట్టుగా డాక్టర్లు లేరు. ప్రపంచ స్థాయిలో వైద్య, ఆరోగ్య రంగంలో పోటీ పడేందుకు భారత్ లో ఆ స్థాయిలో వైద్యులు లేరు. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు సంస్కరణలు తీసుకురావాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పారు. డాక్టర్లకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం, మౌలిక సదుపాయాలు పెంచడం, కౌన్సిలింగ్ సేవలు పెంచడం వంటివి చేయాల్సి ఉంది. ఈ చర్యలపై డాక్టర్లపై మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టి ఏకాగ్రత పెట్టే అవకాశం ఉంటుంది. పని చేస్తున్న ప్రాంతంలో న్యాయ రక్షణ కల్పించాలని, ప్రత్యేక భద్రతా సౌకర్యాలు విస్తరించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఛర్యలు తీసుకునే విధానం, హెల్త్ కేర్ వర్కర్లపై దాడి చేస్తే భారీ ఫెనాల్టీలు వేసే విధంగా చట్టంలో సవరణలు తీసుకురావాలని డాక్లర్లు తమ సర్వేలో సూచించారు.
ఇవి కూడా చదవండి..
Gulf Countries | గల్ఫ్ దేశాల అసలు బలహీనత పడింది.. యుద్దంలో తాగునీటి ప్లాంట్లు కాపాడుకోవడమే మెయిన్ టాస్క్!
Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!
Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం.. దీని విశేషాలు తెలుసా!
Snakes Unique Trick | ఈ పాముల తెలివి మామూలుగా లేదుగా… వీడియో చూడండి..
