Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!

Chai Guy | పేదరికాన్ని దాటి కష్టపడి చదివి.. అమెరికా దాకా వెళ్తే.. లేఆఫ్ అతని జీవితాన్ని మళ్లీ మొదటికి తెచ్చింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఛాయ్ గయ్‌గా పాపులరయ్యాడు. ఇదీ బిహార్‌కు చెందిన ప్రభాకర్ ప్రసాద్ విజయగాథ!

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!

Chai Guy | పేదరికంలో పుట్టాడు.. దుప్పట్లు కొనే స్థోమత లేక చలికాలంలో బియ్యపు సంచుల కింద నిద్రపోయే రోజులను చూశాడు.. వాటన్నింటి మధ్య కష్టపడి చదివి ఐఐటీలో చేరాడు. మధ్యలో ఆటుపోట్లు ఎదురైన వాటన్నింటినీ అధిగమించి అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాడు. కానీ లేఆఫ్ ఒక్కసారిగా అతని జీవితాన్ని మళ్లీ అగాధంలో పడేసింది. అయినా నిరాశపడకుండా కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఛాయ్‌ గయ్‌గా టీ అమ్ముతున్నాడు. బీహార్‌కు చెందిన ప్రభాకర్ ప్రసాద్ విజయగాథ ఇదీ!

బీహార్‌లోని పట్నా సమీపంలో ఉన్న చిన్న పట్టణంలో జన్మించిన ప్రభాకర్ ప్రసాద్ బాల్యం నుంచే చాలా పేదరికాన్ని అనుభవించాడు. తన తండ్రి ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసిరాలేదు. దీంతో డబ్బులకు చాలా ఇబ్బంది అయ్యేది. చలికాలంలో దుప్పట్లు కొనుక్కునే స్థోమత లేకపోవడంతో బియ్యం సంచులను కప్పుకుని నిద్రపోయే దుస్థితి ఉండేది. ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడేసి, జీవితాన్ని మార్చగలిగేది చదువు ఒక్కటేనని అతని తండ్రి నమ్మేవాడు. అందుకే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా పిల్లల చదువు ఆపించలేదు. తమ ఇంటికి దగ్గరలో ఉన్న హిందీ మీడియం స్కూల్‌లో చదివించాడు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభాకర్ కుటుంబం రాత్రికి రాత్రే బిహార్‌ను వదిలి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లాల్సి వచ్చింది. అది ప్రభాకర్ జీవితం మొత్తాన్ని మార్చేసింది.

టెక్ జాబ్ వదిలేసి మోడలింగ్ వైపు అడుగులు

భోపాల్‌ వచ్చాక అతని తండ్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ప్రభాకర్‌ను చేర్పించాడు. హిందీ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి మారడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అతని యాసపై తోటి విద్యార్థులు హేళన చేసేవారు. అయినప్పటికీ వాటన్నింటినీ పట్టించుకోకుండా కష్టపడి చదివాడు. చివరకు ఐఐటీలో సీటు సాధించాడు. అక్కడ చదువు పూర్తయ్యాక 2008లో ఐటీ జాబ్ కూడా పొందాడు. కానీ కోడింగ్‌‌లో అతనికి పెద్ద ఆసక్తి రాలేదు. దీంతో ఏదైనా కొత్తగా చేయాలని.. తనకు ఇష్టమైన జిమ్‌కు ఎక్కువ సమయం కేటాయించాడు. అప్పుడే బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి పెరిగింది. అది కాస్త మోడలింగ్ వైపు వెళ్లాలనే ఆలోచనను పుట్టించింది. అనుకున్నదే తడువుగా ప్రభాకర్ భోపాల్ నుంచి ముంబైకి షిఫ్టయ్యాడు. అక్కడ అంధేరీలోని చిన్న గదిలో ఉంటూ అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి.. కానీ అవకాశాలేవీ రాలేదు. దీంతో మోడలింగ్ వదిలేసి జీవితంలో సెటిలవ్వాలని అనుకున్నాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ అమెరికాలో ఉండటంతో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 2014లో టెక్సాస్‌కు వెళ్లి ఎంబీఏ చదివాడు.

జాబ్ పోయింది.. లవ్ ఫెయిల్యూర్ అయ్యింది..

ఎంబీఏ పూర్తయిన తర్వాత ప్రభాకర్ అమెరికాలోనే కార్పొరేట్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. కొన్నేళ్లు హాయిగా గడిచిపోయాయి. మంచి జాబ్ ఉన్నప్పటికీ ఏదో అసంతృప్తితో రగిలిపోయేవాడు. అయినా ఉద్యోగంలో కొనసాగాడు. కానీ 2025 ఫిబ్రవరిలో జరిగిన లేఆఫ్‌లో ఉద్యోగం పోయింది. అప్పుడే గర్ల్‌ఫ్రెండ్ కూడా వదిలేసింది. జాబ్ పోయింది.. లవ్ ఫెయిల్యూర్ అయ్యింది.. ఇలా ఒకదానికొకటి సమస్యలు చుట్టుముట్టడంతో ప్రభాకర్ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. జీవితంలో ఏం చేయాలో తెలియని రోజులు కూడా వచ్చాయి. అలా ఒక రోజు రాత్రి రూమ్‌లో ఒక్కడే ఉన్నప్పుడు తనను తానే ప్రశ్నించుకున్నాడు. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చిన తన వెంటే ఉన్నది ఏంటని ఆలోచించుకున్నాడు. అప్పుడే అతనికి ఛాయ్ గుర్తొచ్చింది. తాను ఎక్కడ ఉన్నా, ఏ బాధలో ఉన్నా స్వయంగా ఛాయ్ చేసుకుని తాగేవాడినని.. అది తాగాక మనసుకు ఎంతో రిలాక్సింగ్‌గా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. ఆ ఛాయ్‌నే తన జీవితంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

బిహార్ స్టైల్లో టీ అమ్ముతూ.. ఛాయ్ గయ్‌గా పాపులర్

అలా చేతిలో డబ్బులేని స్థితిలో కాలిఫోర్నియాలో టీ అమ్మడం మొదలుపెట్టాడు. ఉదయం 3 గంటలకే లేచి ఛాయ్ ప్రిపేర్ చేసుకుని అమ్మేవాడు. మొదట్లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గలేదు. కొత్త ఆలోచనతో సాంప్రదాయ బీహారీ స్టైల్‌లో భుజంపై గమ్చా వేసుకుని టీ అమ్మడం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ప్రభాకర్‌ ఛాయ్ బిజినెస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఒక కప్పు టీని ప్రభాకర్ 8 డాలర్లు (దాదాపు రూ.780)కి అమ్ముతున్నాడు. చివరకు జీవితంలో సక్సెస్ కావడంపై ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చెబుతున్నాడు. ‘బియ్యం సంచుల కింద నిద్రించిన రోజుల నుంచి అమెరికాలో టీ అమ్మే వరకు వచ్చాను.. నేను సీఈవో కాలేకపోయినా ఛాయ్ గయ్‌ను అయ్యాడు. ఇప్పుడు మాత్రం జీవితంలో నిజంగా స్థిరపడినట్లు అనిపిస్తోంది.’ అని చెబుతున్నాడు.