Viral Video | ఈ రోజుల్లో చాలామంది అత్తాకోడళ్లకు అస్సలు పడదు. కానీ హర్యానాలో మాత్రం ఓ కోడలు అత్త కోసం సాహసం చేసింది. వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల అత్త కోరిక తీర్చేందుకు ఆమెను నెత్తిపై మోసుకుంటూ దాదాపు 260కి.మీ. పరిక్రమ యాత్రను చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు అత్త కోసం కోడలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.
బ్రజ్ ప్రాంతంలో నివసించే కాజల్ చౌదరి ప్రముఖ జానపద గాయని. 90 ఏళ్ల వయసు ఉన్న ఆమె అత్త చంద్రీదేవికి బ్రిజ్ పరిక్రమ యాత్ర చేయాలని కోరిక ఉండేది. కానీ ఆమె ఆరోగ్యంగా ఉన్న సమయంలో కుదరలేదు. ఇప్పుడు నడవలేని స్థితికి చేరుకోవడంతో బ్రిజ్ పరిక్రమ యాత్ర చేయలేకపోతున్నానని దిగులు చేసింది. దీంతో అత్త కోరికను ఎలాగైనా తీర్చాలని కాజల్ చౌదరి నిర్ణయించుకుంది. ఒక ప్లాస్టిక్ బుట్టలో అత్తను కూర్చోబెట్టుకుని నెత్తిపై మోసుకుంటూ పరిక్రమ యాత్ర ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అత్త కోరికను తీర్చేందుకు ఆమెను నెత్తిపై మోసుకుంటూ భక్తి, పట్టుదలతో ముందుకు వెళ్లడం చూసి అందరూ షాకవుతున్నారు.
Unique service was witnessed during the Braj 84 Kos Parikrama.
-A daughter-in-law carried her mother-in-law on her head for the pilgrimage.
-Such love, respect, and dedication are rarely seen in today’s times. Radhe Radhe! pic.twitter.com/NXOYsHZlJM
— Dharm (@dhram00) June 1, 2026
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ‘ఇలాంటి కోడలు దొరకడం నిజంగా అదృష్టం‘, ‘అత్త కోరిక కోసం కోడలు చేసిన త్యాగం గొప్పది‘, ‘నేటికాలంలో ఇలాంటి ప్రేమ, గౌరవం చాలా అరుదు‘ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె సేవాభావాన్ని కొనియాడుతున్నారు. కాగా, ఇక కాజల్ చౌదరి మాట్లాడుతూ.. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొంది. తనను ఇలా మోసుకుంటూ పరిక్రమ యాత్రకు తీసుకెళ్లమని ఏనాడూ అడగలేదని తెలిపింది. ఆమె కోరిక నెరవేరితే తనకు సంతృప్తి కలుగుతుందని.. అందుకే ఈ పరిక్రమలో నేనే మోసుకెళ్తున్నానని చెప్పింది.
ఉత్తర భారతదేశంలో బ్రిజ్ పరిక్రమ యాత్రను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. శ్రీకృష్ణుడు నడియాడిన పవిత్ర స్థలాల గుండా సాగే ఈ యాత్ర సుమారు 84 కోసులు సాగుతుంది. అంటే సుమారు 260 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావన్‌లతో పాటు హర్యాణా, రాజస్థాన్‌లోని కృష్ణుడి పుణ్యక్షేత్రాల గుండా ఈ యాత్ర వెళ్తుంది. ఈ సందర్భంగా కుంటలు, అరణ్య ప్రాంతాలు వంటి కఠినమైన దారుల నుంచి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా భక్తులు ఈ పరిక్రమ యాత్ర పూర్తి చేయడానికి దాదాపు 40 రోజుల సమయం పడుతుంది.