Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం.. దీని విశేషాలు తెలుసా!

Floating Village | మన భారత దేశంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. పర్వతాలు, ఎడారులు, అడవులు, దీవులు మాత్రమే కాదు.. నీటిపై తేలియాడే గ్రామం కూడా ఉంది. భారత్‌లోనే ఏకైక నీటిపై తేలియాడే గ్రామంగా మణిపూర్‌లోని చంపు ఖాంగ్‌పోక్‌ అనే గ్రామం గుర్తింపు పొందింది.

Reported by: Chandram | Latest News | Mar 08, 2026, 11:42 pm IST
Read Time: 5 mins
Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం.. దీని విశేషాలు తెలుసా!

Floating Village | మన భారత దేశంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. పర్వతాలు, ఎడారులు, అడవులు, దీవులు మాత్రమే కాదు.. నీటిపై తేలియాడే గ్రామం కూడా ఉంది. భారత్‌లోనే ఏకైక నీటిపై తేలియాడే గ్రామంగా మణిపూర్‌లోని చంపు ఖాంగ్‌పోక్‌ అనే గ్రామం గుర్తింపు పొందింది. లోక్‌తక్‌ సరస్సులో కుళ్లిపోయిన మొక్కల వ్యర్థాలతో సహజంగా ఏర్పడే ద్వీపాలపై ఈ గ్రామం నిర్మించబడింది. మరి ఆ గ్రామ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మణిపూర్‌లోని లోక్‌తక్‌ సరస్సుపై ఉన్న చంపు ఖాంగ్‌పోక్‌ అనే గ్రామాన్ని భారత్‌లోని ఏకైక నీటిపై తేలియాడే గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని ఇళ్లు, రోడ్లు, లైఫ్‌స్టైల్ మొత్తం అన్నీ కూడా ఈ సరస్సులో తేలియాడే సహజ వనరులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామం ఫుమ్డిస్‌ అని పిలవబడే ద్వీపాలపై నిర్మించబడింది. నిజానికి ఫుమ్డిస్‌ అంటే కుళ్లిపోయిన మొక్కలు, మట్టి, సేంద్రీయ పదార్థాలు కలగలిసి ఏర్పడిన గట్టి పొరలు. ఇవి ఖాళీ మట్టి పొరల్లా కనిపించినప్పటికీ చాలా బలంగా ఉంటాయి. ఇళ్లను, మనుషుల బరువు మోయగలవు. అలాగే ఇక్కడ తోటలు కూడా సాగు చేసుకోవచ్చు.

వెదురు బొంగులతో ఇళ్లు.. పొట్టకూటికి చేపల వేట

చంపు ఖాంగ్‌పోక్‌ గ్రామ ప్రజల జీవితం మొత్తం లోక్‌తక్‌ సరస్సు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడి గ్రామ ప్రజలు అనునిత్యం ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారు. ఆహారం మొదలు ఇతర అవసరాలు అన్నింటికీ ఆ సరస్సుపైనే ఆధారపడతారు. వెదురు, కలప, గడ్డి వంటి వాటితోనే ఇక్కడ ఇండ్లను నిర్మించుకుంటారు. సరస్సులో ఉండే చేపలను పట్టి అమ్ముకోవడం ద్వారానే కావాల్సిన డబ్బు సంపాదించుకుంటారు. ఇక ఇక్కడ రవాణా కోసం పడవలను మాత్రమే వాడుతారు. ఇక్కడి పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు పడవల ద్వారానే సరస్సు గట్టు వరకు వెళ్తారు.

పర్యావరణ అనుకూల జీవన విధానానికి ఈ గ్రామాన్ని మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ ఎలాంటి కాంక్రీట్‌ నిర్మాణాలు లేకపోవడం వల్ల ప్రకృతికి హాని తక్కువగా జరుగుతుంది. ఇదే సరస్సులో ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనమైన కేబుల్‌ లాంజావో నేషనల్‌ పార్క్‌ కూడా ఉంది.

మరిన్ని ఆసక్తికర విషయాలు

– గాలి, నీటి ప్రవాహాల వల్ల ఈ గ్రామం కొద్ది కొద్దిగా కదులుతూ ఉంటుంది.
– నీటి అలల మధ్య ఇళ్లు సమతుల్యంగా ఉండేందుకు తరచూ మార్పులు చేయాల్సి ఉంటుంది.
– సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడ అందంగా కనిపిస్తాయి. ఆ అపురూప దృశ్యాన్ని చూసి మైమరచిపోవచ్చు. అందుకే పర్యాటకులు, పరిశోధకులన ఈ గ్రామం విశేషంగా ఆకట్టుకుంటుంది.