అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా(Sathya Sai Baba) ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. పుట్టపర్తి (Puttaparthi) హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవ రూపంలోని దేవుడు సాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ప్రకటించారు. “సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారు. మానవులను ప్రేమించాలి. ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని కొనియాడారు. సాయి గారు మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వహకుల అందరిలో కనిపిస్తోంది.
సాయి సేవా కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం
ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను బాబా, వారి ట్రస్టు ద్వారా చేసి చూపించారని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నాడు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారు. తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారు అని తెలిపారు. మానవ సేవ మాధవ సేవ అని బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారు. 140 దేశాల్లో బాబాకి భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సాయి శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
