Mohammad Azharuddin : అజారుద్దీన్‌ పదవి గండాన్ని…తప్పించే త్యాగశీలి ఎవరో ?

మంత్రి అజారుద్దీన్ పదవి నిలబెట్టడం కాంగ్రెస్‌కు సవాల్‌గా మారింది. ఎమ్మెల్సీ సభ్యత్వం కోసం ఎవరు రాజీనామా చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది.

Mohammad Azharuddin

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు వ్యూహంతో పాటు కేబినెట్ లో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించే క్రమంలో మహ్మద్ అజారుద్ధీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పదవిని కాపడటం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అసెంబ్లీ, మండలిలో సభ్యుడు కాని అజారుద్ధీన్ ను కేబినెట్ మంత్రిని చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల వ్యవధిలో ఆయన ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉంది. కానీ మంత్రి పదవి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నప్పటికి… ఇంతవరకు అజారుద్దీన్ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో ఆయన మంత్రి పదవి ప్రమాదంలో పడినట్లయ్యింది. దీంతో 6 నెలలలోగా అజారుద్ధీన్ ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసేందుకు ఏం చేయాలన్నదానిపై ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ గా తయారైంది.

2025అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్‌ 30 ఏప్రిల్ 2026 నాటికి ఉభయ సభల్లో ఏదేని ఒకదానిలో సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. కోదండరామ్, అజార్ ఎమ్మెల్సీ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటం, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ లేకపోవడంతో ఈ సమస్య పరిష్కారం కాంగ్రెస్ నాయకత్వానికి పరీక్షగా మారింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై వేసిన కేసులో తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం లేకుండా పోయింది.

అజారుద్దీన్ కోసం త్యాగం చేసే త్యాగశీలి ఎవరు?

మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్ధిన్ మంత్రి పదవి కోల్పోతే..ఆ వర్గం ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన అధికార పార్టీని కలవరపెడుతుంది. అజారుద్దిన్ మంత్రి పదవి వ్యవహారంపై గురువారం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ లో జరిగిన భేటీలో హైకమాండ్ తో కీలక చర్చ కొనసాగింది. మండలిలో ఉన్న ఎమ్మెల్సీలలో ఎవరితోనైనా రాజీనామా చేయించి, ఆ పదవిని అజారుద్దీన్‌కు కట్టబెట్టడం కేబినెట్ లో ఆయనను కొనసాగించాలని హైకమాండ్ నేతలు ఖర్గే, రాహుల్, వేణు గోపాల్ లు రాష్ట్ర నాయకులకు సూచించినట్లుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలలో ఎవరు తమ పదవిని అజారుద్ధీన్ కోసం త్యాగం చేస్తారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరందుకుంది. ఎమ్మెల్సీగా రాజీనామా చేసే నాయకుడికి సీఎం రేవంత్ రెడ్డి ఏ పదవి ఆఫర్ ఇస్తారు..ఎలా రాజీనామాకు ఒప్పిస్తారన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Toxic Teaser: యశ్​ కొత్త అవతారం… హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో సంచలనం
Naa Anveshana | యూట్యూబర్ నా అన్వేష్‌కు దెబ్బ మీద దెబ్బ .. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించిన మెటా

Latest News