J&K Kishtwar Encounter | జమ్మూకశ్మీర్​ అడవుల్లో భారీ ఆపరేషన్.. మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాది సైఫుల్లా ఎన్‌కౌంటర్‌లో మృతి

కిష్త్వార్ చత్రూ అడవుల్లో ‘ఆపరేషన్ త్రాషి–1’లో జైష్ కమాండర్ సైఫుల్లా సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. డ్రోన్ నిఘా సాయంతో నిర్వహించిన భద్రతా దళాల ఈ సంయుక్త ఆపరేషన్ చినాబ్ లోయలో ఉగ్ర నెట్‌వర్క్‌కు భారీ ఎదురుదెబ్బగా నిలిచింది.

Saifullah Baloch, alleged Jaish-e-Mohammed commander, killed in Kishtwar encounter

Three Jaish Terrorists, Including Commander Saifullah, Killed In Kishtwar Encounter

విధాత భారత్​ డెస్క్​ | హైదరాబాద్​:

J&K Kishtwar Encounter | జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చత్రూ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఆధారిత జైష్​–ఎ‌‌–మొహమ్మద్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా బలోచ్ కూడా ఉన్నట్టు అధికార వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. చినాబ్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

20 సార్లు తప్పించుకున్న సైఫుల్లా.. నిఘా సమాచారంతో ఖచ్చితమైన ఆపరేషన్

గత రెండేళ్లుగా కిష్త్వార్​–దోడా అటవీ ప్రాంతాల్లో తిరుగాడుతూ భద్రతా బలగాలకు సవాల్‌గా మారిన జైష్​ ​(Jaish-e-Mohammed) కమాండర్​ సైఫుల్లా కనీసం 20 సార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. సైనికులపై దాడుల ప్రణాళికలో, స్థానిక మాడ్యూల్‌ల సమన్వయంలో అతడి పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణల్లో వెల్లడైంది.

అత్యంత విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా జనవరిలో ప్రారంభమైన ‘ఆపరేషన్ త్రాషి–1’ కింద చత్రూ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాసర్‌కుట్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన తర్వాత భద్రతా దళాలు చుట్టుముట్టగా, ఉగ్రవాదులు ముందుగా కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరువైపులా భీకరమైన కాల్పులు జరిగాయి.

డ్రోన్ల సాయంతో గుర్తింపు.. మట్టి ఇంట్లో దాక్కుని కాల్పులు

ఈ ఆపరేషన్‌ను భారత సైన్యంలోని వైట్​ నైట్​ కార్ప్స్​(White Knight Corps), జమ్మూ కాశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించాయి. మంచుతో కప్పుకున్న ఎత్తైన పర్వత ప్రాంతంలో డ్రోన్ నిఘా కీలక పాత్ర పోషించింది.

ఉగ్రవాదులు ఓ మట్టి ఇల్లులో దాక్కుని కాల్పులు జరపగా, ఎదురుదాడిలో ఆ ఇల్లు బూడిదైంది. ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో బయటపడ్డాయి. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 రైఫిళ్లు, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో ఇద్దరు పాకిస్తానీ జాతీయులని అధికారులు పేర్కొన్నారు. అధికారిక గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

చినాబ్ లోయలో ఉగ్రవాదంపై కట్టుదిట్టమైన వ్యూహం

‘ఆపరేషన్ త్రాషి–1’ కిష్త్వార్​లోని చత్రూ, సొన్నార్, దోల్గామ్, దిచ్చార్ వంటి క్లిష్టమైన అటవీ పర్వత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతోంది. గత నెలలోనే ఈ ప్రాంతంలో పలు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జమ్మూ ప్రాంతంలో వేర్వేరు ఆపరేషన్లలో ఆరుగురు జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు.

భద్రతా దళాలు “శాంతిని భంగం చేయాలనుకునేవారికి ఎక్కడా ఆశ్రయం ఉండదు” అని స్పష్టం చేశాయి. ప్రస్తుతం కిష్త్వార్ అటవీ ప్రాంతాల్లో శోధన చర్యలు కొనసాగుతున్నాయి.

సరిహద్దు ఇవతల పనిచేస్తున్న మాడ్యూల్‌లను ఛేదించడమే లక్ష్యంగా గూఢచారి వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, భూభాగ అవగాహన—అన్ని కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని భద్రతా వర్గాలు వెల్లడించాయి. చినాబ్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించే దిశగా ఆపరేషన్లు మరింత వేగం పుంజుకుంటున్నాయి.

Latest News