బెంగాల్‌లో సంచలనం : రాజీనామాకు మమత నో – అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్
బెంగాల్‌లో రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మమతా బెనర్జీ రాజీనామా నిరాకరించడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.
అసెంబ్లీ రద్దుతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ మార్పులకు తెరలేచింది.
Bengal Political Crisis: Governor Dissolves Assembly After Mamata Refuses To Resign
హైలైట్స్
- మమతా బెనర్జీ రాజీనామా చేయనని స్పష్టం
- గవర్నర్ ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీ రద్దు
- ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాలు చేయనున్న తృణమూల్
- శనివారం బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
విధాత భారత్ డెస్క్ | మే 7, 2026 | హైదరాబాద్:
WB Guv Dissolves Assembly | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో పరిస్థితి తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి రాష్ట్ర శాసనసభను అధికారికంగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గురువారం అర్ధరాత్రితో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో, రాజ్‌భవన్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులను గురువారం ప్రజలకు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం మే 7, 2026వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభ రద్దు చేస్తున్నట్లు ఏక వ్యాక్య ప్రకటనలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన బీజేపీ త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు పాత ప్రభుత్వం ఆపద్ధర్మ విధానంలో కొనసాగుతుంది. అయితే ఈసారి మమతా బెనర్జీ “నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను” అని ప్రకటించడం దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన సంఘటనగా మారింది.
ప్రజాతీర్పును దోచుకున్నారు : మమత ఆరోపణలు

“నేను ఓడిపోలేదు.. రాజీనామా చేయను” అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ సాధించిన విజయం ప్రజల అసలు తీర్పు కాదని, “లూటీ” వల్ల వచ్చిన ఫలితమని ఆరోపించారు. తాను ఓడిపోలేదని, అందువల్ల లోక్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిపక్ష కూటమి నేతలు మమతకు మద్దతు తెలపగా, బీజేపీ నేతలు మాత్రం ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ నిర్ణయం గవర్నర్ పరిధిలోనే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగ ప్రకారం ఎన్నికల ధృవీకరణ పూర్తైన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రమే పాత ముఖ్యమంత్రి అధికారాలేవీ లేకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతారు.
కోర్టుకెళ్లనున్న తృణమూల్.. శనివారం బీజేపీ ప్రమాణ స్వీకారం?

రాజీనామా వివాదంతో బెంగాల్ రాజకీయాల్లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మమతా బెనర్జీ మధ్య రాజ్యాంగ సంక్షోభం నెలకొంది.
మరోవైపు ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించనున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.
ఇక బెంగాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. శనివారం కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు పదిహేనేళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలుకుతూ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
ఈ పరిణామాలు దేశ రాజకీయాల్లోనే కాకుండా రాజ్యాంగ పరంగా కూడా కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది ఒక ప్రధాన రాజ్యాంగ అధ్యయన అంశంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram