రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!

జూలై 1 నుంచి రైల్వే నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానాలు అమల్లోకి రానున్నాయి. టికెట్ లేకుండా ప్రయాణం, అక్రమ విక్రయాలు, మద్యం మత్తులో గొడవలకు కఠిన చర్యలు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 20, 2026, 2:42 pm IST
Read Time: 5 mins
రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!

ప్రయాణికులకు రైల్వే షాక్ ఇచ్చింది. జరిమానాల నిబంధనలను భారీగా పెంచుతూ సవరణలు చేసింది. రైల్వే నిబంధనలను ఉల్లంఘించేవారిపై విధించే జరిమానాలను రెట్టింపు చేస్తూ…కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.

టికెట్ లేకుండా ప్రయాణిస్తే..జరిమానా రూ.500కుపైనే..

రైళ్లల్లో టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వారికి ఇప్పటి దాకా విధిస్తున్న జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. ఈ జరిమానాను తోడుగా ప్రయాణికుడు ప్రయాణించిన దూరం చార్జీ మొత్తం అదనపు జరిమానాగా వసూలు చేస్తారు. ఇతరుల పేరుతో బుక్ చేసిన టికెట్‌తో ప్రయాణిస్తే ఆ టికెట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తి ఛార్జ్, అదనంగా రూ.500 జరిమానా విధించనున్నారు. మహిళల బోగీలో ఎక్కిన వారికి గరిష్టంగా రూ.2500 వరకు జరిమానా విధిస్తారు. జరిమానా కట్టలేకపోతే కేసును కోర్టుకు పంపనున్నారు. అలాంటి పక్షంలో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే ఛాన్స్‌ కూడా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

ఈ కొత్త నిబంధనలు పబ్లిక్ ట్రస్ట్ చట్టం కింద అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ కొత్త నిబంధనల గురించి తెలియజేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 18న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

అనుమతులు లేకుండా వస్తువులు అమ్మితే జరిమానా

ఇక రైళ్లలో అనుమతులు లేకుండా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడంపై కూడా జరిమానా పెంచారు. రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో అనుమతి లేకుండా వస్తువులు అమ్మినా, వీధి వ్యాపారం చేసినా, కొనుగోళ్లు చేయమని ప్రయాణికులను కోరినా రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించపతే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుది. కోర్టులో మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.5 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. పదేపదే నేరం చేసేవారికి ఒక ఏడాది వరకు జైలు శిక్ష పడవచ్చు.

మద్యం సేవించేవారిపై చర్యలు

ఇక రైళ్లు, రైల్వే స్టేషన్లలో మద్యం సేవించి గొడవ సృష్టించే వారిపై కూడా చట్టపరమైన చర్యలను రైల్వేశాఖ ప్రకటించింది. రైళ్లలో లేదా రైల్వే ప్రాంగణంలో మద్యం మత్తులో ప్రయాణికులను వేధించే, దుర్భాషలాడే, గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వ్యక్తులను రైలు నుండి దించివేసి జరిమానా విధిస్తారు. అలాగే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. టికెట్ లేకుండా ప్రయాణించడం, టికెట్ దుర్వినియోగాన్ని అరికట్టడమే కొత్త నిబంధనల లక్ష్యమని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ నిబంధనలను సిబ్బందికి వివరించి కఠినంగా అమలు చేయాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది.