ప్రకృతి ప్రయాణంలో.. ఖగోళ రంగంలో రేపు అరుదైన పరిణామం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు,అత్యంత చిన్న రాత్రి రేపు ఆదివారం భూగోళ వాసులకు ఎదురుకానుంది. జూన్ 21న సమ్మర్ సోల్‌స్టిస్ సందర్భంగా ఈ ఏడాదిలోనే అత్యధికంగా 13 గంటల 10 నిమిషాల పాటు పగలు ఉంటుంది. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు 23.4 డిగ్రీలుఎక్కువగా వంగి ఉండటంతో ఈ ప్రత్యేక ఖగోళ సంఘటన చోటు చేసుకుంటుందని ఖగోళ నిపుణులు తెలిపారు. ఖగోళ శాస్త్రంలో ఈ అద్భుతమైన సంఘటనను ‘వేసవి అయనాంతం’ (Summer Solstice) అని పిలుస్తారు. దీనివల్ల రేపు సూర్యోదయం సాధారణం కంటే ముందే జరిగి, సూర్యాస్తమయం ఆలస్యంగా అవుతుంది. మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో నిటారుగా ఉన్న వస్తువుల నీడ కూడా భూమిపై పడదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
‘వేసవి అయనాంతం’తో జ్యోతిష్య, పురాణ విశ్వాసాల ప్రకారం ఈ సమయం తర్వాత ‘దేవతల రాత్రి’ ప్రారంభమవుతుందని చెబుతారు. హిందూ ధర్మశాస్త్రాలు, జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం సూర్యుడి గమనాన్ని ‘ఉత్తరాయణం’, ‘దక్షిణాయణం’ అనే రెండు భాగాలుగా విభజిస్తారు. మకర సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ కాలాన్ని దేవతల పగలుగా భావిస్తారు. అనంతరం సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించడం ప్రారంభించే కాలాన్ని దక్షిణాయణం అంటారు. దక్షిణాయణాన్ని ‘దేవతల రాత్రి’కి ప్రతీకగా పేర్కొంటారు. అందుకే జూన్ 21 తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలాన్ని ఆధ్యాత్మికంగా దేవతల రాత్రి ప్రారంభంగా విశ్వసిస్తారు.
ఇదే రోజును ‘విటమిన్-D డే ఆఫ్ ఇండియా’గా పరిగణించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రకటించింది. సూర్యరశ్మి ప్రాధాన్యం, విటమిన్-D ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ఉద్దేశంగా ఐఎంఏ పేర్కొంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ప్రత్యేక రోజున కొద్దిసేపైనా ఉదయం సూర్యకాంతిని ఆస్వాదించండి… ఆరోగ్యానికి మేలు చేసుకోండి! అని పిలుపునిచ్చింది.
ఏడాదిలో రెండు అయనంతాలు
ఏడాదిలో రెండు అయనంతాలు, వేసవి,శీతకాల అయనంతాలు ఏర్పడుతాయి. శీతకాలపు అయనాంతం డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22న జరుగుతుంది. భారతీయ సంప్రదాయాల్లో అయనాంతాల కాలానికి విశేష ప్రాముఖ్యత ఉంది.