విధాత, హైదరాబాద్ : కేంద్రం నుంచి తెలంగాణ అభివృద్ది ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు రాకుండా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డినే అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలతో పెట్టుకున్నావారెవరూ కూడా బతికి బట్టకట్టలేదని, కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీ తర్వాత కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం ఉప్పల్ భగాయత్ లే అవుట్ లో రూ.1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి, రూ.960 కోట్ల రూపాయలతో ఏఓసీ సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్ లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజ్ గిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే క్యూర్ వన్ యాప్ ను ప్రారంభించారు.
జూన్ 15 తర్వాత బరాబర్ నీ సంగతి చెప్తా
అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవ్వాళ కిషన్ రెడ్డి అంటున్నాడని.. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని. అయ్యా..ఇక్కడి ప్రజలతో పెట్టుకున్నోడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నోడు చరిత్రలో బతికి బట్టకట్టలేదు. జూన్ 15 తర్వాత బరాబర్ నీ సంగతి చెప్తా అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్పినట్టే వింటారని బీజేపీ వాళ్లే చెబుతుంటారని, చీకట్లో గూడుపుఠాణి చేయకుండా రాష్ట్రా అభివృద్ధికి సహకరించాలని తాము కోరుతున్నామన్నారు. నేను ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర అభివృద్ది ప్రాజెక్టుల కోసం కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా..కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఒక్కసారి మా వెంట రాలేదని, నన్ను కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి అనుమతులు, నిధులు ఇప్పించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు వెంట రావడానికి..అంత సీక్రెట్ ఏముంటుందని ప్రశ్నించారు. తుమ్మడి హట్టి ప్రాజెక్టు భూసేకరణ సమస్య పరిష్కారానికి నేను మహారాష్ట్ర సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన కలవకుండా తప్పించుకు తిరుగుతున్నారని, కిషన్ రెడ్డి అనుమతులు ఇవ్వద్దని మహారాష్ట్ర సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మెట్రో రైలుకు అనుమతులివ్వాల్సిందే..
మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన అనుమతులతో పాటు రైతుల వడ్లు, మొక్కజొన్నలను కేంద్రం కొనాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 15 తర్వాత దీనిపై ఖచ్చితమైన కార్యాచరణ ఉంటుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పగలు బీజేపీలో ఉంటూ, చీకట్లో కేటీఆర్, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రతిపాదనలు చేశాం. 122 కి.మీ మేర మెట్రో పొడిగింపునకు అన్ని అనుమతులు వచ్చాక.. ఇక్కడి కేంద్రమంత్రి కాళ్ళల్లో కట్టెలు, పుల్లలు పెట్టి అర్ధాంతరంగా ఆపేశారు. ఆయన్ను నిలదీసి అడగాల్సిన అవసరం లేదా? రీజినల్ రింగ్ రోడ్డు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నా.. అనుమతులు రాకుండా ఎవరు ఆపుతున్నారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మల్కాజిగిరి అభివృద్ది పై దృష్టి
మూసీ ప్రక్షాళన కోసం మేం నిధులు అడిగితే కేంద్రం ఇవ్వడం లేదని, ప్రధాని మోదీ మాత్రం తన రాష్ట్రంలో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ది చేసుకున్నారని, మెట్రో విస్తరణకు అనుమతులు, మూసీ ప్రక్షాళనకు, ఆర్ఆర్ఆర్ నిధులు కేంద్రం నుంచి ఎందుకు రావడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. గతంలె కొడంగల్ లో వాడిన నన్ను 2018లో మల్కాజిగిరి ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారని, గత ప్రభుత్వ సహకారంతో ఆశించిన అభివృద్ది చేయలేకపోయానన్నారు. ఇప్పుడు మల్కాజిగిరి అభివృద్దిపై తాను దృష్టి పెట్టానన్నారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం మినీ భారత్ వంటిదన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలని, మిగతా రోజుల్లో రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీని సమగ్ర అభివృద్ది కోసం మూడు కార్పోరేషన్లుగా విభజించామని, పరిపాలన సౌలభ్యం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉప్పల్ కారిడార్ కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టామని, ఈ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో అన్ని మౌలిక వసతులు కల్పనకు నేను సహకారం అందిస్తానన్నారు.
మూసీ కాలుష్యంతో ఉప్పల, నల్లగొండ ప్రజలకు తిప్పలు
ఉప్పల్, నల్లగొండ ప్రజలు మూసీ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశలో గాంధీ సబర్మతి వరకు, రెండో దశలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు అభివృద్ది పనులు జరుగుతాయన్నారు. 100రోజుల్లో మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తారని ఇందుకు సంబంధించిన భూసేకరణ సహా ఇతర సమస్యలన్నీ పరిష్కరించి పనులు చేపట్టేలా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కోరుతున్నానన్నారు. మూసీ మురికి సమస్యతో ఉప్పల్ విలువ తగ్గిందని, ఈ ప్రాంతంలో మూసీ ప్రక్షాళనతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించి తనకు అందిస్తే వెంటనే అనుమతులు, నిధులు మంజూరీ చేస్తానని ప్రకటించారు.
ఉప్పల్ సీఎం సభలో రియల్టర్ల ఫ్లకార్డులు
సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ సభలో రియల్టర్ల అసొసియేషన్ ఫ్లకార్డుల ప్రదర్శన కలకలం రేపింది. ఒక సర్వే నెంబర్లు ఒకటి రెండు ప్లాట్ల కోసం అందులోని భూమి అంతటిని నిషేధిత జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. గమనించిన పోలీసులు వెంటనే రియల్టర్ల నుంచి ఫ్లకార్డులను లాగేసుకుని, వారిని అక్కడి నుంచి పంపించేశారు.