విధాత, హైదరాబాద్ : రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి కీలక అప్డేడ్ వెలువడింది. ఈ నెల 23న జరుగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిశాక యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.9వేల కోట్ల నిధులను సమీకరించుకుని సిద్దంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు మొత్తం రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి రైతు భరోసా నిధులను సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని రైతులు ఆశించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిశాక విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ ముగియ్యడంతో సీఎం రేవంత్ చెప్పిన మేరకు ఏరోజుకారోజు రైతు భరోసా డబ్బులు విడుదలవుతాయని రైతులు ఎదురుచూపులు పడుతున్నారు. ఈ క్రమంలోఈ నెల 23న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ నిధుల విడుదల పైన నిర్ణయం తీసుకొని.. 24వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి అప్డేట్ వచ్చింది.
సాగు వివరాలతో కూడిన శాటిలైట్ సర్వేతో నిమిత్తం లేకుండా ఈ ధఫా గత సీజన్ లో నిధులు విడుదల చేసిన వారందరికీ తిరిగి ఈ సారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. శాటిలైట్ సర్వే (సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో శాటిలైట్ మ్యాపింగ్ సర్వే) ఆధారంగా కేవలం సాగుచేసిన భూములకే సాయం అందజేయాలా లేక గత సీజన్ లో ఇచ్చిన వారందరికి రైతు భరోసా నిధులు అందించాలా అన్న దానిపై మంత్రివర్గ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
గత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో 69,39,548 మంది రైతులకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.8,744.13 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చారు. దాదాపు 1,45,73,000 ఎకరాలకు నిధులు అందించారు. ఈ యాసంగిలోనూ దాదాపు 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందనుందని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Seethakka : మంత్రి సీతక్క చొరవ..పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖలో పదోన్నతులు
Umpire Dies of Bee Attack | క్రికెట్ మ్యాచ్‌లో విషాదం: తేనేటీగల దాడిలో అంపైర్ మృతి
