Umpire Dies of Bee Attack | క్రికెట్ మ్యాచ్‌లో విషాదం: తేనేటీగల దాడిలో అంపైర్ మృతి

ఉన్నావ్‌లో క్రికెట్ మ్యాచ్ సమయంలో తేనేటీగల దాడిలో సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా మృతి చెందారు. 30 ఏళ్ల అనుభవం కలిగి రాష్ట్ర ప్యానెల్ అంపైర్‌గా సేవలందించిన ఆయన మరణం క్రికెట్ వర్గాల్లో విషాదం నింపింది.

Reported by: ADHARVA | క్రీడలు | Feb 20, 2026, 1:26 pm IST
Read Time: 5 mins
Umpire Dies of Bee Attack | క్రికెట్ మ్యాచ్‌లో విషాదం: తేనేటీగల దాడిలో అంపైర్ మృతి

Tragedy in Cricket Match: Umpire Dies After Bee Swarm Attack in UP

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

Umpire Dies of Bee Attack | ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ విషాదంగా మారింది. దాదాపు 30 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా తేనేటీగల దాడికి గురై ప్రాణాలు కోల్పోయారు. సప్రూ మైదాన్‌లో జరిగిన ఈ ఘటన క్రికెట్ వర్గాలను తీవ్రంగా కలచివేసింది.

 డ్రింక్స్ బ్రేక్‌లో ఆకస్మిక దాడి

ఫిబ్రవరి 18 సాయంత్రం శుక్లగంజ్ ప్రాంతంలోని సప్రూ మైదాన్‌లో మ్యాచ్ జరుగుతుండగా, ఒకేసారి తేనేటీగల గుంపు మైదానంపై దాడి చేసింది. తన మ్యాచ్ ముగించుకున్న మాణిక్ గుప్తా, మరో మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్న సహచరుడిని డ్రింక్స్ బ్రేక్ సమయంలో కలవడానికి వెళ్లారు. ఇద్దరూ టీ తాగుతుండగా వెనుక నుంచి తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.

తప్పించుకోవడానికి పరుగెత్తే క్రమంలో మాణిక్ గుప్తా బ్యాలెన్స్​ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే తేనేటీగలు ఆయనను పూర్తిగా కమ్మేసాయి. అక్కడున్న మరో అంపైర్ జగదీష్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా తేనెటీగ కాట్లకు గురయ్యారు. సుమారు 15 నుండి 20 మంది ఆటగాళ్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలింపు – చికిత్స పొందుతూ మృతి

Locals providing first aid to the injured umpire after a bee swarm attack at Sapru Maidan in Unnao - Inset : Veteran cricket umpire Manik Gupta File Photo

తీవ్ర గాయాల కారణంగా మాణిక్ గుప్తా అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మొదట ఆయనను శుక్లగంజ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.

ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు కూడా తేనేటీగలు ముఖం, శరీరంపై అలాగే అతుక్కొని ఉన్నాయని కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.సింగ్ తెలిపారు. ఈ ఘటన తీవ్రతను అది సూచిస్తోంది.

 మూడు దశాబ్దాల సేవ.. క్రికెట్‌కు అంకితభావం

65 ఏళ్ల మాణిక్ గుప్తా కాన్పూర్ క్రికెట్ వర్గాల్లో గౌరవనీయుడిగా గుర్తింపు పొందారు. దాదాపు 30 ఏళ్లుగా అంపైరింగ్ చేస్తూ రాష్ట్ర ప్యానెల్ అంపైర్‌గా సేవలందించారు. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.

తన జీవితాన్ని మొత్తం అంపైరింగ్‌కే అంకితం చేసి కుటుంబాన్ని పోషించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనపై అసోసియేషన్ తీవ్ర సంతాపం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి పూర్తి సహాయ–సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది.